- కనీస మద్దతు ధర కంటే ఎక్కువే
- పల్లీ కొనుగోలుకు పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులు
- క్వాలిటీ వేరుశనగా దొరకడంతో పెరిగిన డిమాండ్
- ఈసారి తెగుళ్ల కారణంగా తగ్గిన దిగుబడి సర్కార్ వెల్లడి
వనపర్తి, వెలుగు: వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లీ రికార్డు ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,263 కాగా, గరిష్టంగా రూ.9,020 పలికింది. గత కొన్నేండ్లుగా గిట్టుబాటు ధర లేకపోవడంతో జిల్లాలో వేరుశనగ పంట సాగు తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు మార్కెట్లకే వేరుశనగ వస్తున్నది.
అందులోనూ వనపర్తి మార్కెట్‌కే ఎక్కువ పంట వస్తున్నది. నాగర్‌కర్నూలులో క్వింటా పల్లీ గరిష్టంగా రూ.8,129, గద్వాలలో రూ.7,778 పలికింది. అయితే, వనపర్తిలో మాత్రం గత 15 రోజులుగా క్వింటాలు ధర రూ.8,400కు తక్కువ కాకుండా నమోదవుతున్నది. గడిచిన 15 రోజుల్లో వనపర్తి మార్కెట్ యార్డులో 13వేల బస్తాలు, గద్వాలలో 6వేల బస్తాలు, నాగర్‌కర్నూల్‌లో 100 బస్తాలు కొనుగోలు చేశారు.
నేల స్వభావంతో మేలైన పంట
వనపర్తి జిల్లాలోని నేల స్వభావం కారణంగా ఇక్కడ పండించే వేరుశనగలో అఫ్లాటాక్సిన్ ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వనపర్తి వచ్చి పంట కొనుగోలు చేస్తున్నారు. దీంతో పల్లీకి డిమాండ్ పెరిగింది. ఈ సారి ఖరీఫ్‌లో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పంటకు తెగులుసోకి దిగుబడి 20 శాతానికి తగ్గింది. 20 వేల ఎకరాల్లో పల్లీ పంట సాగు చేశారు.
దిగుబడి మాత్రం 10 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంటను మార్కెట్ కు తీసుకొచ్చాక మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు మేలైన విత్తనాలు సరఫరా
మూడేండ్లుగా వనపర్తి జిల్లాలో వేరుశనగ సాగు తగ్గుతూ వస్తున్నది. 2022–23లో 22వేల ఎకరాలున్న సాగు.. నిరుడు 15వేలకు పడిపోయింది. అయితే, ఏటా కోట్ల రూపాయలు విలువ చేసే వంట నూనెలను కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన ప్రాంతానికి కావాల్సిన వంట, ఇతర నూనెలను మనమే ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఈ పథకం కింద వనపర్తి జిల్లాలోని పాన్‌గల్, పెద్దమందడి, పెబ్బేరు మండలాల్లో ఎంపిక చేసిన రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఇక్రిశాట్ సైంటిస్టులు అభివృద్ధి చేసిన కదిరి, లేపాక్షి, జీజేసీ-32, గిర్నాల్ రకాల వేరుశనగ విత్తనాలను జాతీయ నూనె గింజల ఉత్పత్తి పథకం కింద అందజేశారు. దీంతో ఈ ఏడాది 25వేల ఎకరాల్లో యాసంగి సాగు కానున్నది. ఇది నిరుడి కంటే 50 శాతం ఎక్కువ.
ఇసుకతువ్వ భూమిలో అఫ్లాటాక్సిన్ ఉండదు
వనపర్తి జిల్లాలోని భూముల్లో అఫ్లాటాక్సిన్ శిలీంద్రం చాలా తక్కువ. దీంతో ఇక్కడి ఇసుక తువ్వ నేలల్లో పండించే వేరుశనగ మేలైనదిగా పరిగ ణిస్తారు. ఫలితంగా ఎగుమతి రకంగా గుర్తించడంతో ఇక్కడి పల్లీకి వ్యాపారు ల్లో మంచి డిమాండ్ ఉంటుంది.
- డా.రాజేందర్‌రెడ్డి, కేవీకే సైంటిస్ట్
