నాగర్ కర్నూల్/ వనపర్తి, వెలుగు : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు బాధ్యతాయుతమైన పాలన అందించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక - 99 రోజుల కార్యాచరణ’ అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు రోజూ ఉదయం 6 గంటలకే వార్డులు, గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, భూ భారతి దరఖాస్తులను రాబోయే 20 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ , ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ రాజేశ్ రెడ్డి మాట్లాడారు. కాగా, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
