హార్మూజ్ జలసంధి.. పశ్చిమాసియా నుంచి రవాణా కోసం ఉన్న ఏకైక చవకైన, దగ్గరైన మార్గం. యుద్ధం కారణంగా జలసంధి నుంచి నౌకలు వెళ్లకుండా ఆంక్షలు విధించింది ఇరాన్. దాదాపు కనిపిస్తే కాల్చివేసే పరిస్థితులు ఉన్నాయక్కడ. ఇప్పటికే పలు నౌకలను మిసైళ్లతో పేల్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై పోర్టుకు చమురు నౌక చేరడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకుంటోంది.
గురువారం (మార్చి 12) హార్మూజ్ రూట్ ద్వారా ముంబై పోర్టుకు నౌక చేరుకుంది. మార్చి 1న సౌదీలోని రాస్ తనురా ఓడరేవు నుంచి బయలుదేరిన షెన్ లాంగ్ సూయెజ్ మాక్స్ నౌక.. ఆంక్షలను దాటుకుని ఇండియా చేరుకుంది. మార్చి 8న హర్మూజ్ జలసంధిలో చివరిసారి నౌక సిగ్నల్స్ కనిపించాయి. హార్మూజ్ జలసంధి దాటిన తర్వాత సిగ్నల్స్ కనిపించకపోవడంతో ఏం జరిగిందోననే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే జల సంధిని రెండు రోజుల క్రితమే నౌక దాటి రావటం గమనార్హం.
సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో వచ్చిన తొలి లైబీరియన్ జెండా నౌక ఇది. భారతీయ కెప్టెన్ చాకచక్యంతో ముంబై పోర్టును చేరుకుంది. వార్ ప్రారంభమయ్యాక ఇండియా చేరుకున్న తొలి నౌక ఇదే కావడం విశేషం. ఉద్రిక్తల వేళ భారత్ కు చమురు నౌకలు చేరుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ALSO READ : కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ బాంబు దాడులు..
నౌకను జలసంధిని దాటించడంలో భారత కెప్టెన్ చాకచక్యంగా వ్యవహరించారు. శత్రువుల దాడులు తప్పించుకునేందుకు గోయింగ్ డార్క్ పద్ధతి అమలు చేశారు. నౌకను గుర్తించకుండా ఆటోమేటెడ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) నిలిపివేశారు. భారతీయ కెప్టెన్ నేతృత్వంలో ముంబై పోర్టుకు చేరుకుంది ఈ చమురు నౌక. భారత్ కు చేరుకున్న తర్వాత మళ్లీ ట్రాకింగ్ సిస్టమ్ లో నౌక సిగ్నల్స్ కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వార్ కారణంగా హర్మూజ్ జలసంధిలో అనేక చమురు నౌకలు చిక్కుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నౌక జలసంధిని దాటడం సాహసంతో కూడిన వ్యవహారమే.
