కడప జిల్లాలో అమానుష ఘటన జరిగింది. భార్య గదిలో ఉరేసుకుంటుంటే భర్త నవ్వుతూ కిటికీలో నుంచి వీడియో తీశాడు. పైగా.. అలా కాదు ఇలా ఉరేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. భార్య తనను బెదిరించడానికి ఇలా చేస్తుందనుకుని భర్త చేసిన పొరపాటు ఆమె ప్రాణం తీసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్ శ్రీనివాస్ రైల్వేలో లోకో పైలెట్‌గా పని చేస్తున్నాడు. అతనికి కృష్ణవేణి అనే యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహమే కావడం గమనార్హం. ఇద్దరూ కొన్నాళ్లు సఖ్యంగానే ఉన్నా ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సహజమే కానీ ఈ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో పెద్దలు ఇద్దరికి సర్ది చెప్పి సర్దుకుపోవాలని.. అయిన దానికి, కాని దానికి ఇలా గొడవలు పడొద్దని రాజీ చేశారు. అప్పటి నుంచి కొన్నాళ్లు భార్యాభర్త బాగానే ఉన్నట్టు అనిపించినా మళ్లీ ఈ మధ్య గొడవలు మొదలయ్యాయి. శ్రీనివాస్ భార్య కృష్ణవేణి పలు మార్లు గతంలో చచ్చిపోతానని, ఇలా రోజూ గొడవ పడుతూ బతకడం తన వల్ల కాదని భర్తతో అనేదని ఇరుగుపొరుగు తెలిపారు.
కోపంలో ఇలాంటి మాటలు అనుకుంటూ ఉంటారని అంతా అనుకున్నారు. కానీ.. కృష్ణవేణి అన్నంత పనిచేసింది. భర్త చూస్తుండగానే ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సింది పోయి, అడ్డుకోవాల్సిన భర్త ఉరి తాడు అలా కాదు ఇలా కట్టుకోవాలని వెటకారపు కూతలు కూస్తూ వీడియో తీశాడు. కృష్ణవేణి ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
