అసిఫాబాద్‌లో పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత భయం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోల్ ,డీజిల్ కోసం బంకుల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఉంది.పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్, చమురు రవాణా నిలిచిపోవడంతో మొదట ప్రధాన నగరాలు.. ఇప్పుడు రూరల్ ఏరియాల్లో అటు గ్యాస్, ఇటు పెట్రోల్ , డీజిల్ కొరత భయం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
శుక్రవారం (మార్చి 13) ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో చేరారు. పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి క్యూలలో నిల్చుని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన కొరత కారణంగా జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకులు మూసివేయబడ్డాయి. ఒకే ఒక బంక్ తెరిచి ఉండటంతో స్థానిక వాహనదారులంతా అక్కడికి చేరి భారీ క్యూలు కట్టారు.
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో గ్యాస్, చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభం ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. హార్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ దేశాలకు చమురు రవాణా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దేశంలోని కూడా ఈ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలోని కూడా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో గ్యాస్, చమురు నిల్వలు తగినంతగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇంధన సరఫరా సమస్యలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
