- 12 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల ఓజీకుష్ స్వాధీనం
- ఐదుగురు అరెస్ట్
చందానగర్, వెలుగు: ఐటీ కారిడార్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరితో పాటు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద 12 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల ఓజీకుష్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం.. కృష్ణ జిల్లా ఎలమలూరు గ్రామానికి చెందిన వంశీ దిలీప్(29), చీరాల రామకృష్ణపురం గ్రామానికి చెందిన బాల ప్రకాశ్బాలు(29) న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని బెంగలూరులో ఓ నైజీరియన్ వద్ద ఎండీఎంఏ, ఓజీకుష్ కొనుక్కొని హైదరాబాద్‌కు వచ్చారు.
సోమవారం కొండాపూర్ అంజయ్యనగర్‌లోని ఓ పీజీ హాస్టల్లో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించగా రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మణికంఠ మణితేజ(30), ఐటీ ఉద్యోగి రోహిత్ గౌడ్(26), బిజినేస్మ్యాన్ తరుణ్(33)ను అదుపులోకి తీసుకున్నారు. మణితేజ, రోహిత్‌గౌడ్, తరుణ్‌కు పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వీరి వద్ద రూ.లక్షా 50 వేల విలువైన ఎండీఎంఏ, ఓజీకుష్, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అలీం, ఓజీ కుష్ సప్లై చేసిన కార్తీక్, బెంగళూరులో అమ్మిన నైజీరియన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
