రేవంత్ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్!?! ఇంటా బయటా తిరుగులేదు.. కలిసొస్తున్న రాజకీయ వాతావరణం!

రేవంత్ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్!?! ఇంటా బయటా తిరుగులేదు.. కలిసొస్తున్న రాజకీయ వాతావరణం!

పదవీ కాలంలో  సగానికి  దగ్గరవుతున్న వేళ... కాంగ్రెస్ పార్టీలో ‘అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాపబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా  మారిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ప్రజాక్షేత్రమే మిగిలింది. అక్కడ పరిస్థితుల్ని సానుకూలం చేసుకోవడాన్నిబట్టే ఆయన రాజకీయ భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచీ ప్రగతి ఆధారపడనుంది. పాలనా పగ్గాలు చేపట్టిన 2023 నుంచి ఇప్పటివరకు అన్నీ ఆయనకు అనుకూలిస్తూ వస్తున్నాయి. అవి యాదృచ్ఛికంగా జరిగాయని అనుకోవడానికి లేదు.

అందుకు ఆయన శ్రమ, వ్యూహాత్మక ఎత్తుగడలకు తోడు పరిస్థితులు, ప్రత్యర్థుల లోపాలు, తప్పిదాలు కూడా కారణమవుతూ వచ్చాయి. అధికార సుస్థిరతకు పార్టీలో  ఆధిపత్యమొకటే  సరిపోదు.  తమ  ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, వాటిపై రాజకీయ వైఖరి వంటివి... ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో బహిరంగంగా.. ‘వచ్చే పదేళ్లు  నేనే ముఖ్యమంత్రిని’ అన్నవాళ్లూ లేరు! పార్టీలో ఆధిపత్యం ఎంత అవసరమో  ప్రజాక్షేత్రంలో జనామోదం అంతకన్నా ముఖ్యమన్నది గ్రహిస్తే... ఎప్పటికప్పుడు  ప్రజాభిప్రాయం  తెలుసుకోవడం,  అందుకనుగుణంగా  మసలుకోవాల్సిన  ఆవశ్యకత ఆయనకు  తెలిసివస్తుంది.  

అధికారంలో ఉన్నపుడు  అనుకూల పరిణామాలు కనిపించినంత స్పష్టంగా ప్రతికూల విషయాలు కంటికానవు.  ఏ చిన్న విషయాలు  రాజకీయ ఉదాసీనతో,  దీర్ఘకాల  నిర్లక్ష్యంవల్లో ఎటువంటి విపరిణామాలకు దారితీస్తాయో అంచనా కూడా దొరకదు. అటువంటి  అంశాలను గుర్తించడం, సకాలంలో సరిదిద్దుకోవడమే రాజకీయ విజ్ఞత అని సమకాలీన రాజకీయాల్లో  పలుమార్లు  రుజువైంది.  ‘నాలుగయిదు ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి ఉల్లిగడ్డలు  దిగుమతి చేసి ఉంటే, 1988 ఎన్నికల్లో  బీజేపీ ప్రభుత్వాలు (ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్) ఓడిపోయి ఉండేవి కావు’ అని  ప్రయివేటు సంభాషణలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్ నాయకుడు, దివంగత నేత కోట్ల విజయభాస్కరరెడ్డి  గతంలో  చేసిన వ్యాఖ్యలు ఇందుకో ఉదాహరణ మాత్రమే!

‘నలభై ఏళ్ల ఇండస్ట్రీ..’ అని చంకలు గుద్దుకునే చాలా మంది కన్నా దీటుగా కాంగ్రెస్ రాజకీయాలను  ఒంటబట్టించుకొని,  పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటున్న  తెలంగాణ  సీఎం  రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  ప్రజాక్షేత్రంలో జనం మద్దతుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు  కనిపించదు. ఏలిన వారి అశ్రద్ధ వల్లే కొన్ని  ప్రజా సంబంధ అంశాలు తరచూ వివాదాస్పద మవుతున్నాయి. జనంలో వ్యతిరేకతను పెంచుతున్నాయి.  నగరం,  పట్టణాల్లో  కూల్చివేతలు, ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు,  తరచూ జాప్యం జరుగుతున్న  రైతు భరోసా,  మెరుగుపడని విద్యా ప్రమాణాలు వంటి అంశాలను  ప్రతిపక్షాలు ప్రచారాస్త్రాలుగా మలచుకుంటున్నాయి.

ఇంటా బయటా తిరుగులేదు
కాంగ్రెస్ పార్టీలో,  ప్రభుత్వంలో  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సంపూర్ణ ఆధిపత్యం సంపాదించారు. పార్టీ అధిష్టానం వద్ద తన మాటకు తిరుగులేని పరిస్థితి నెలకొని ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఇదొక  క్రమ పరిణామం!

అంతా ఆయన కృషి, వ్యూహాత్మక ఎత్తుగడల వల్ల మాత్రమే కాకుండా ఇందుకు ఇంటా, బయటా పలు కారణాలు ఉండవచ్చు.  కానీ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీలో ఆయన సాధించిన ఆధిపత్యం మాత్రం కాదనలేని  వాస్తవం. పీసీసీ అధ్యక్ష నియామకం నుంచి, డీసీసీ/ సీసీసీ నేతల కూర్పు, కార్పొరేషన్ పదవులు,  ఎమ్మెల్సీల ఖరారు,  మంత్రివర్గ  విస్తరణ,  తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడం వరకు ఆయన మాట చెల్లుబాటయిన తీరే నిదర్శనం.

అధిష్టానం ఆశీస్సులు
2024 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలతోపాటు రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతి, -మున్సిపల్ వంటి స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలకు ఢిల్లీ నాయకత్వం సంతృ ప్తితో ఉంది.  కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి తాను అందించే సహకారం ద్వారా ఆయన వారి నిరంతర ఆశీస్సులు పొందడం పార్టీ రాష్ట్ర నాయక,  కార్యకర్తల దృష్టి నుంచి జారిపోయే అంశమేం కాదు.

ప్రపంచ దిగ్గజ ఫుట్​బాల్ ఆటగాడు మెస్సీని ‘హైదరాబాద్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు పిలిచినా, కాంగ్రెస్ రాజకీయ శిక్షణ శిబిరం ముగింపు భేటీకి రమ్మన్నా పార్టీ ముఖ్యనేత రాహుల్ రావటం అధిష్టానం వద్ద రేవంత్ పరపతినే చాటుతోంది. పార్టీ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో దూకుడుగా వ్యవహరించి, సచివాలయంలో ‘రివ్యూ’లు, సెంట్రల్ యూనివర్సిటీలో ‘అభిప్రాయసేకరణ’ జరిపిన  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్ కూడా ఇప్పుడు సీఎం బాటలోకే వచ్చారు. ‘ఆబ్సెంట్ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లా వ్యవహరించడం సరికాదన్న విమర్శ తర్వాత  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఆయనతో సయోధ్యతోనే ఉంటున్నారు.

కలిసొస్తున్న రాజకీయ వాతావరణం!
కాలక్రమంలో రాష్ట్ర  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెలకొన్న సమీకరణాలు, పరిస్థితులు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి అనుకూలిస్తున్నాయి. ఒకప్పటిలాగా పార్టీలో ద్వితీయస్థాయి నాయకులెవరూ ఆయనకు సమీపంగా వచ్చి భయపెట్టే పరిస్థితులు ఇపుడు లేవు. కాసు బ్రహ్మానందరెడ్డి కాలం నుంచి కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ రెడ్డి వరకు దాదాపు అందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సమస్థాయిలోనో, కొంచెం అటుఇటుగానో ఉండే పలువురు ఇతర నాయకులు పార్టీలో ఉండేవారు.

వారికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎంతో కొంత దన్నుగా ఉండేది. అటువంటి నాయకుల ఉనికి, క్రియాశీలత నాటి ముఖ్యమంత్రులకు జడుపు కలిగించేది. అధిష్టానం లెక్కింపుల్లో అదొక కీలకాంశమయ్యేది. ఇప్పుడు దాదాపు ప్రతి జిల్లాలో మంత్రులతో సహా ఒకరికి మరొకరి పొడ గిట్టదు. వారి నడుమ సఖ్యత, ఏకాభిప్రాయం ఎంతో అరుదు.

దశాబ్దాల తరబడి ఒక సంస్కృతిగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాతుకుపోయినట్టు, ముఖ్యమంత్రిని విభేదించే స్థాయిలో ఏ మంత్రికి మరొక ఎమ్మెల్యే మద్దతు (కుటుంబ సభ్యులున్న చోట తప్ప!) కూడా లేని పరిస్థితి! ఇవన్నీ స్థూలంగా పార్టీకి, నిర్దిష్టంగా ముఖ్యమంత్రికి అనుకూలించే అంశాలే !

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జడిపించే స్థాయిలో రాష్ట్ర బీజేపీ సంస్థాగతంగా ఎదగలేకపోతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పదేళ్ల ‘పాలనా బ్యాగేజీ’ భారం వల్ల గట్టిగా గొంతెత్తలేకపోతోంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి ఎన్నికల్లో  పోటీ చేయకపోవడం, తగిన హేతువు లేకుండా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వంటి వారి వ్యూహపరమైన తప్పిదాలు కూడా అంతిమంగా రేవంత్ నాయకత్వానికే మేలు చేస్తున్నాయి.

‘తనదైన ముద్ర’ కోసం తపన
సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకించే  స్వపక్షీయ కాంగ్రెస్ నేతలు, విపక్ష  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అగ్రనేతలు ఆయన శక్తి-సామర్థ్యాలను తక్కువ అంచనా వేసి పొరబడ్డారు. పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకోవడంలో ప్రత్యర్థుల ‘అంచనాల పొరపాటు’ ఆయనకే లాభిస్తోంది. రాజకీయంగా ఎదిగాకే రేవంత్ రెడ్డి  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  వచ్చినా.. సీనియర్ నేతలు, పరస్పరం భిన్నులైన మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వైఖరులను ఒంటబట్టించుకున్నారు.

తెలుగుదేశంలో ఉన్నపుడు మిత్రుడిని ఎమ్మెల్సీని చేసే యత్నంలో  ‘ఓటుకు నోటు’ కేసులో  ఇరుక్కొని  ఇబ్బందులు  పడాల్సివచ్చినా,  మిత్రధర్మాన్ని నిలుపుకుంటూ  పట్టుదలగా ఆయనని  కాంగ్రెస్  సర్కారులో తన సలహాదారు, ఎంపీని చేసుకోగలిగారు.  ఢిల్లీ నాయకత్వంతో తాను సదా అప్రమత్తంగా మెలిగేటట్టు, తన ‘ఆంతరంగిక’ విధేయ ఎంపీల సంఖ్య పెంచుకుంటున్నారు.  బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల మద్దతు నిలుపుకోవడంలో, వారిని పదవులు కోల్పోయే సంక్షోభం నుంచి తప్పించడంలో సీఎం  సఫలీకృత్యులయ్యారు.  తదుపరి  ఏం జరగనుందో ఎవరి అంచనాలకూ చిక్కడం లేదు.

ప్రజామద్దతు కూడగట్టడమే ప్రజాస్వామ్యంలో కీలకం! 
 ప్రత్యర్థులు హైకోర్టు  తలుపు తట్టడాన్ని బట్టి వారి ‘అనర్హత వేటు’ న్యాయసమీక్షకు నిలుస్తుందా?   ఈ లోపున  ప్రత్యర్థి శిబిరం నుంచి మూడింట  రెండొంతుల (26 మంది) మద్దతు  కూడగట్టడం ద్వారా ‘విలీన’ రక్షణ కవచాన్ని అడ్డువేస్తారా?  వేచి చూడాల్సిందే!  ఇలా పార్టీలో బలోపేతం అవుతూనే  రాష్ట్రంలో,  తెలంగాణ మనోభావాల పరంగానూ  తనదైన ‘ముద్ర’ వేయడానికి  రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి యత్నిస్తున్నారు. తెలుగుతల్లి విగ్రహం, గద్దర్ అవార్డులు, ఉద్యమకారుల గుర్తింపు,  శాసన మండలి కొత్త భవనం,  మూసీ  సుందరీకరణ,  గాంధీ విగ్రహ తలంపు ఇవన్నీ అందులో భాగమే!  వ్యూహపరంగా ఓకే,  మరి జనం మద్దతు సంగతేంటి?  అన్న ప్రశ్న సహజం!

రాజకీయ వ్యూహాలు ఎన్నున్నా అంతిమంగా ప్రజామద్దతు కూడగట్టడమే ప్రజాస్వామ్యంలో కీలకం! ప్రజల సమస్యల్ని పరిష్కరించి, వారికిచ్చిన హామీలు నెరవేర్చి, వారి అవసరాల్ని తీర్చడమే పాలకుల ప్రథమ కర్తవ్యం.  అదే  పాలకులకు మద్దతో, తిరస్కరణో  తేలుస్తుంది. ఈ అంశం నిర్లక్ష్యం చేసినవారు రాజకీయంగా ఎంతటి  ఘనాపాఠీలయినా  చరిత్ర పొరల్లో  కనుమరుగవుతుంటారు. పార్టీలో అధిపత్యం సాధించిన  సీఎం  ప్రజాక్షేత్రంలో  పట్టు, మద్దతు ఎలా కూడగడతారన్నది ప్రశ్న!  మరో  రెండున్నర ఏళ్లకు వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు  రేపటి  జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలొక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గీటురాయి.

దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.