నెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు

నెలసరి సెలవుపై చట్టం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలివ్వరు: సుప్రీంకోర్టు
  • చట్టం కంటే అవగాహన ముఖ్యం: సుప్రీం

న్యూఢిల్లీ: నెలసరి సెలవులను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకొస్తే.. అది మహిళల ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి చట్టం ఉంటే ప్రైవేట్ సంస్థల యజమానులు మహిళలను పనిలోకి తీసుకోవడానికి వెనకాడుతారని తెలిపింది. దీనివల్ల మహిళల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని పేర్కొంది. 

చదువుకునే విద్యార్థినులకు, ఉద్యోగం చేసే మహిళలకు 'వేతనంతో కూడిన నెలసరి సెలవుల' ను తప్పనిసరి చేసేలా దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. 

దీనిని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌‌‌‌‌మల్య బాగ్చి బెంచ్ శుక్రవారం విచారించింది. పిటిషనర్ శైలేంద్ర మణి త్రిపాఠి వాదిస్తూ..నెలసరి టైంలో కలిగే నొప్పి మహిళల పని సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు.మాతృత్వ సెలవులు ఇచ్చినట్లే నెలసరి సెలవులను కూడా చట్టబద్ధం చేయాలన్నారు. 

కేరళంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు పీరియడ్స్ సెలవులను అమలు చేస్తోందని.. దీనిని దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు. 

కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఇప్పటికే నెలసరి సెలవులను ఇస్తున్నాయని.. కాబట్టి దీనిని చట్టం రూపంలోకి తెస్తే అందరికీ న్యాయం జరుగుతుందని వాదించారు.

పురుషులకంటే తక్కువనే ముద్ర పడుతుంది

వాదన అనంతరం సుప్రీంకోర్టు స్పందిస్తూ.."మేం నెలసరిపై చట్టాన్ని చేస్తే, రేపు ఏ సంస్థ యజమాని కూడా మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల మహిళల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయి. మహిళలు.. పురుషుల కంటే తక్కువ అనే ముద్ర పడే ప్రమాదమూ ఉంది. ఇది ఆఫీసుల్లో వారి గౌరవాన్ని తగ్గిస్తుంది. 

వ్యాపార కోణంలో ఆలోచించండి. ఒక యజమాని తన సంస్థలో అదనపు సెలవులు డిమాండ్ చేసేవారిని ఎందుకు నియమించుకుంటారు? ఆమె వల్ల సంస్థకు పని దినాలు తగ్గుతాయి, ఖర్చు పెరుగుతుంది" అంటూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను తోసిపుచ్చింది.