చెరువులోకి దూసుకెళ్లిన కారు..  మద్యం మత్తు, అతివేగమే కారణం.. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన

చెరువులోకి దూసుకెళ్లిన కారు..  మద్యం మత్తు, అతివేగమే కారణం.. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
  •   కారును అక్కడే వదిలేసి వెళ్లిన ఇద్దరు

షాద్ నగర్, వెలుగు: మద్యం మత్తుకు అతివేగం తోడవడంతో ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. షాద్​నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటన్​పల్లి వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా బండ్ల జాగీర్​కు చెందిన కజ్జం రామంతా తన గ్రాండ్ విట్టారా కారును పని నిమిత్తం అత్తాపూర్​ వాసి శ్రీకాంత్ రెడ్డికి ఇచ్చారు. అయితే శ్రీకాంత్ రెడ్డి, మరో వ్యక్తి నరేశ్​తో కలిసి దూసకల్ గ్రామానికి వెళ్లి వస్తుండగా, రాత్రి పదిన్నర గంటల సమయంలో మద్యం మత్తులో అజాగ్రత్తగా కారు నడిపి చెరువులో పడేశారు.

ప్రమాదాన్ని ముందే గమనించిన ఇద్దరు కారును అక్కడే వదిలేసి పరారవ్వగా, స్థానికుల సమాచారంతో పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వాహనాన్ని కారు బయటకు తీశారు. ఈ ఘటనపై కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కారుపై రూ. 9 వేల వరకు చలాన్​లు ఉండడం గమనార్హం.