జూరాల బ్రిడ్జిపై రగడ!..డ్యామ్  సేఫ్టీ యాక్ట్ కు జంకుతున్న ఇరిగేషన్ ఆఫీసర్లు

జూరాల బ్రిడ్జిపై రగడ!..డ్యామ్  సేఫ్టీ యాక్ట్ కు జంకుతున్న ఇరిగేషన్ ఆఫీసర్లు
  • ఎన్ వోసీ ఇచ్చేందుకు వెనకడుగు
  • ప్రాజెక్ట్​ భద్రత దృష్ట్యా కిలోమీటర్  లోపలే కట్టాలని విజ్ఞప్తి
  • ఆర్అండ్ బీ శాఖ ఫండ్స్ తో కడితే ఎక్కడైనా కట్టుకోవచ్చంటున్న ఇరిగేషన్​ శాఖ
  • స్థల మార్పిడితో 40 గ్రామాల ప్రజలకు తిప్పలే

గద్వాల, వెలుగు: జూరాల హై లెవెల్  బ్రిడ్జి నిర్మాణంపై లడాయి ముదురుతోంది. జూరాల ప్రాజెక్టు డ్యాం సేఫ్టీలో భాగంగా బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడితే జూరాల ప్రాజెక్టుకు కిలోమీటర్  లోపలే కట్టాలని ఇరిగేషన్  శాఖ స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఆర్అండ్ బీ ఫండ్స్ తో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడితే ఎక్కడైనా కట్టుకోవచ్చని చెబుతూనే.. డ్యామ్  సేఫ్టీ కోసం దిగువన తప్పనిసరిగా బ్రిడ్జి నిర్మించాలని గట్టిగా చెబుతోంది.

దీంతో గద్వాల మండలం కొత్తపల్లి–ఆత్మకూరు మధ్య నిర్మించ తలపెట్టిన హై లెవెల్  బ్రిడ్జి నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల ఇరిగేషన్  మినిస్టర్  జూరాల పర్యటనకు వచ్చినప్పుడు హై లెవెల్  బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆ పనులు ప్రారంభం అయ్యే దశలో ఉండగా, ఇరిగేషన్  శాఖ ఎన్ వోసీ ఇచ్చేందుకు షరతులు పెడుతోంది.

డ్యామ్  సేఫ్టీ యాక్ట్ కు జంకుతున్న ఇరిగేషన్ ఆఫీసర్లు..

2021 డ్యామ్  సేఫ్టీ యాక్ట్​కు ఇరిగేషన్  ఆఫీసర్లు జంకుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్  నుంచి ఆ యాక్ట్ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని ఇరిగేషన్  ఆఫీసర్లు చెబుతున్నారు. ఆ యాక్ట్  ప్రకారం ఇరిగేషన్  ప్రాజెక్టుల పూర్తి బాధ్యత వాటిని పర్యవేక్షించే ఆఫీసర్లదేనని స్పష్టమవుతోంది. దీని ప్రకారం వరదలకు ముందు, తరువాత ప్రాజెక్టులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ నివేదికల ప్రకారం ఆఫీసర్లను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్అండ్ బీ శాఖ చేపడుతున్న బ్రిడ్జికి ఇరిగేషన్  ఆఫీసర్లు ఎన్ వోసీ ఇచ్చేందుకు జంకుతున్నారు.

మినిస్టర్  రివ్యూలో రచ్చ..

ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని ఇరిగేషన్  ప్రాజెక్టులపై రివ్యూ మీటింగ్  నిర్వహించారు. ఈ మీటింగ్ లో కూడా హై లెవెల్  బ్రిడ్జి నిర్మాణం పై రచ్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి ఇరిగేషన్  సెక్రటరీకి ఈ వ్యవహారంపై రిపోర్ట్  ఇవ్వాలని ఆదేశించారు.

ప్రాజెక్టుపై రాకపోకలతో ఇబ్బందులు..

జూరాల ప్రాజెక్టుపై భారీ వెహికల్స్  రాకపోకలతో డ్యామ్  భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఇరిగేషన్  ఆఫీసర్లు చెబుతున్నారు. భారీ వెహికల్స్ వెళ్తే వైబ్రేషన్స్ తో గేట్లకు ఉండే రబ్బర్  సీల్స్  డ్యామేజ్  అవుతున్నాయని, దీంతో లీకేజీలు వస్తున్నాయని అంటున్నారు. అలాగే స్లాబ్  దెబ్బతిని ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి రాకపోకలు జరుగుతుండడంతో జూరాల ప్రాజెక్టుకే ముప్పు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్థలం మార్పుతోనే వివాదం..

బ్రిడ్జి నిర్మాణం చేసే స్థలం మార్పుతో వివాదం ముదురుతోంది. పాత ఎస్టిమేషన్ల ప్రకారం జూరాల డ్యామ్  దిగువన కిలోమీటర్  దూరంలో ధరూర్  మండలం రేవులపల్లి, ఆత్మకూరు మండలం నందిమల్ల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని ప్రపోజల్స్​ రెడీ చేశారు. కానీ, ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని జూరాల ప్రాజెక్టుకు 12 కిలోమీటర్ల దిగువకు మార్చారు. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూరు మండలం జూరాల మధ్య బ్రిడ్జి నిర్మించాలని టెండర్లు పిలిచారు. అయితే డ్యామ్  సేఫ్టీలో భాగంగా బ్రిడ్జి నిర్మించాలనుకుంటే ప్రాజెక్టుకు దిగువన కిలోమీటర్  లోపలే చేపట్టాలని ఇరిగేషన్  ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇరిగేషన్  ప్రాజెక్టు సేఫ్టీలో భాగంగా నిర్మించిన బ్రిడ్జిలన్నీ కిలోమీటర్ లోపే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులను ఆర్అండ్ బీ శాఖ చూస్తోంది. ఆర్అండ్ బీ ఫండ్స్  నుంచి కడితే వారు ఎక్కడైనా కట్టుకోవచ్చని, కానీ, డ్యామ్  సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్​ దిగువన ఒక బ్రిడ్జి తప్పకుండా కట్టాలని అంటున్నారు. లేదంటే జూరాల ప్రాజెక్టుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

రాకపోకలు బంద్  అయితే తిప్పలే..

జూరాల డ్యాంపై రాకపోకలు నిలిపి వేస్తే 40 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. ప్రాజెక్ట్​ దిగువన బ్రిడ్జి నిర్మాణం చేపడితే ఈ గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం 12 కిలోమీటర్ల దూరంలో హై లెవెల్  బ్రిడ్జి నిర్మించాక జూరాల డ్యామ్ పై రాకపోకలు నిలిపి వేస్తే అటు ఇరిగేషన్ 
 ఆఫీసర్లతో పాటు ఈ 40 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

బ్రిడ్జి కోసం ఎదురుచూపులు..

గతంలో జూరాల దిగువన 950 మీటర్ల పొడవున రూ.100 కోట్లతో బ్రిడ్జి నిర్మించేందుకు ఎస్టిమేషన్లు తయారు చేశారు. కానీ, ఆ పనులు కార్యరూపం దాల్చలేదు. డ్యామ్  గేట్ల లీకేజీతో నీళ్లు దిగువకు వెళ్ళిపోతున్నాయని,  జూరాల డ్యాం భద్రత ప్రమాదంలో పడిందని ప్రచారం జరగడంతో గత ఏడాది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాలను సందర్శించారు. జూరాల రిపేర్లతో పాటు డ్యాం దిగువన హై లెవెల్  బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 750 మీటర్ల పొడవుతో 20 పిల్లర్లతో రూ.121 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇటీవల సీఎం పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు తవ్వే పనులు కొనసాగుతున్నాయి.

ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది..

హై లెవెల్  బ్రిడ్జి నిర్మాణం పై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూరాల దిగువన బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని రివ్యూ మీటింగ్ లో చెప్పాం. జూరాల డ్యాంపై రాకపోకలతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.– రహీముద్దీన్, ఇరిగేషన్​ ఎస్ఈ