- రూ.300 కోట్లతో నంగునూరు మండలం నర్మెట గ్రామంలోని 365 ఎకరాల్లో నిర్మాణం
- ఈ నెల 22న ప్రారంభించనున్న సీఎం
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్రంలో తొలిసారి తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయిల్ పామ్ రైతుల కోసం రైతు మేళా నిర్వహించనున్నారు.
65 ఎకరాల్లో రూ.300 కోట్లతో 2023లో పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించారు. ఇప్పటికే అశ్వారావుపేట, అప్పారావుపేటల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నా తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీ నర్మెటలో పూర్తయింది. కాలుష్య రహితంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగు నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు రైతు మేళా నిర్వహించనుండగా, చివరి రోజు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులను ఉద్దేశించి
ప్రసంగిస్తారు.
స్థానికంగానే రిఫైన్డ్ అండ్ ప్యాకింగ్
నర్మెటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీలో గెలల నుంచి తీసిన క్రూడ్ పామాయిల్ ను స్థానికంగానే రిఫైన్డ్ చేసి మార్కెట్ లో అమ్మకానికి సిద్ధం చేస్తారు. ఇది రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ ఫ్యాక్టరీగా గుర్తింపు పొందనుంది. అశ్వరావుపేట, అప్పారావుపేటల్లోని ఫ్యాక్టరీలో క్రూడ్ పామాయిల్ ను తయారు చేసి రాజేంద్ర నగర్ లోని ఆయిల్ ఫెడ్ సంస్థ కు పంపి అక్కడ రిఫైన్ చేస్తున్నారు.
నర్మెట ఫ్యాక్టరీలో గంటకు 25 టన్నుల పామాయిల్ ను ప్యాకింగ్ చేసే కెపాసిటీ ఉంది. గంటకు 30 టన్నుల క్రషింగ్ కెపాసిటీ కలిగి ఉండగా, ఉత్పత్తి పెరిగే కొద్ది క్రషింగ్ కెపాసిటీని పెంచుకునేలా ఫ్యాక్టరీని డిజైన్ చేశారు.
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం
రైతాంగాన్ని ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లించేందుకు సిద్దిపేట ప్రాంతంలో అత్యాధునిక టెక్నాలజీతో రిఫైన్డ్ పామాయిల్ ప్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 70 వేల మంది రైతులు 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 15 వేల మంది రైతులు 5 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు, కోతుల బెడద లేకుండా నాలుగేండ్లలో చేతికి వచ్చే ఆయిల్పామ్సాగుతో 30 ఏండ్లు ఆదాయం పొందే అవకాశం ఉండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. నాలుగేండ్లుగా సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా, ఇటీవలే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుండడంతో ఆయిల్‌పామ్ గెలలు అమ్ముకునే అవకాశం ఏర్పడనుంది.
సిద్దిపేటతో పాటు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, మెదక్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలకు నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉండడంతో ఇక్కడ రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అనువుగా ఉంటుంది.
వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి
ఆయిల్ పామ్ గెలల వ్యర్థాలతో నాలుగు మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. కాలుష్యరహితంగా ఫ్యాక్టరీని నిర్మించి, వ్యర్థాలను ఉడికించి అత్యాధునిక టర్బైన్లతో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ విద్యుత్ ను ప్యాక్టరీ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది.
స్థానిక యువతకు ఉపాధి..
నర్మెట పామాయిల్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే స్థానిక యువతతో పాటు వేలాది కుటుంబాలకు ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీలో 500 మంది యువకులకు పని కల్పిస్తే, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఫ్యాక్టరీ ప్రారంభంతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు మరింత పెరిగే అవకాశం ఉంది.
