- కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించే విషయంలో హైడ్రాకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ఎంతో కీలకంగా పని చేసిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. వికసిత్ భారత్2047 సాధనలో భూముల సర్వేలో విధానాలు, ఎదురయ్యే సవాళ్లపై ఎన్ఆర్ఎస్సీ సెంటర్ లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగనాథ్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి ఈ డేటా వాడుతున్నామన్నారు.
ఎన్ఆర్ఎస్సీ లెక్కల ప్రకారం 61 శాతం చెరువులు మాయమయ్యాయని, మనం పట్టించుకోకపోతే 15 ఏండ్లలో మిగతా చెరువులు కూడా కనుమరుగవుతాయన్నారు. ఓఆర్ ఆర్ పరిధిలో 1300 ఎకరాలను కాపాడామని, దీని విలువ రూ70 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు.
పోర్టల్లో చెరువుల వివరాలు..
కాగా, సదస్సులో పలువురు శాస్త్రవేత్తల సమక్షంలో ‘హైడ్రా-రక్ష’ పోర్టల్ ప్రారంభించారు. ఓఆర్ ఆర్ పరిధిలోని చెరువులు, నాలాల హద్దులతో పాటు భూముల వివరాలు తెలుసుకునేందుకు హైడ్రా రక్ష పోర్టల్ ఉపయోగపడతుంది.
చెరువులు, ప్రభుత్వ భూములను ప్రజలు కొని మోసపోకుండా సరైన సమాచారం ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానుంది. కొంటున్న ప్లాట్లు చెరువుల చెంత ఉన్నాయా.. నాలాల బఫర్‌లోనివా అనేది తెలుసుకోడానికి వీలు కుదురుతుంది.
హైడ్రా పని అభినందనీయం: ఇస్రో చైర్మన్
నీటి వనరులను కాపాడడంలో హైడ్రా చొరవ అభినందనీయమని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అన్నారు. సదస్సులో వర్చ్యువల్ గా ఆయన మాట్లాడారు. ఇస్రో సాంకేతిక పరిజ్ఞనాన్ని సామాన్యులకు చేరవేయడంలో హైడ్రా చొరవ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ఎన్ ఆర్ ఎస్ సీ డైరెక్టర్ డాక్ట్ ప్రకాష్ చౌహాన్, ఇస్రో మాజీ చైర్మెన్ ఏఎస్ కిరణ్ కుమార్‌తో పాటు పలువురు ఈ సదస్సులో పాల్గొని చెరువులు, పార్కులు కాపాడడంలో హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
