న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ గుబులు రోజురోజుకూ పెరుగు తోంది. ముందుజాగ్రత్త చర్యగా రీఫిల్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు, వాట్సాప్ చానెళ్లలో ప్రయత్నిస్తుండగా బుకింగ్స్ ఏకంగా మూడు రెట్లకు చేరడంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ బుకింగ్ సిస్టమ్స్ క్రాష్ అయిపోయాయి. దీంతో వినియోగదారులు ఎలాగైనా రీఫిల్ అందుకునేందుకు పలు నగరాల్లో ఏజెన్సీలకు పరుగులు పెట్టారు. భారీ సంఖ్యలో క్యూలో నిల్చుని సిలిండర్ తీసుకునిపోతున్నారు.
గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో పలు సిటీల్లో పెండ్లిండ్లు, శభకార్యాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. క్యాటరర్లు తమ సిలిండర్లతో వంట వండేందుకు ముందుకు రావడం లేదు. సిలిండర్ ఇస్తేనే వంట చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ముంబై, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్ తదితర నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ‘‘కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు దొరకడం లేదు. దీంతో వంటలు చేయడానికి మాకు వీలు కావడం లేదు.
సాధారణంగా చండీగఢ్‌లో ఒక ఈవెంట్‌కు 15 నుంచి 20 సిలిండర్లు వాడతాం. ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో చాలా మంది క్యాటరర్లు కట్టెలు, బొగ్గుతో వంట చేస్తున్నారు” అని చండీగఢ్ లో ప్రముఖ క్యాటరింగ్ కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
