ఇసుక మేటలపై ఆటలు గుడారాల్లో రాత్రి బస!..పర్యాటకులకు అందుబాటులోకి రానున్న బ్లాక్ బెర్రీ క్యాంపు

ఇసుక మేటలపై ఆటలు గుడారాల్లో రాత్రి బస!..పర్యాటకులకు అందుబాటులోకి రానున్న  బ్లాక్ బెర్రీ క్యాంపు
  • ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో రూ. కోటితో నిర్మాణం 
  • గతేడాది ఏర్పాటు చేయగా.. వానాకాలంలో తొలగింపు  
  • మళ్లీ క్యాంపును వారంలో ఓపెన్ చేసేందుకు ఆఫీసర్ల చర్యలు

ములుగు,వెలుగు: వీకెండ్స్ లో బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఫ్యామిలీ, ఫ్రెండ్‌  తో వచ్చి ఎంజాయ్ చేసేందుకు బ్లాక్ బెర్రీ క్యాంప్ స్వాగతం పలుకుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో గతేడాది ఏర్పాటైన క్యాంపు మరో వారంలో అందుబాటులోకి రానుంది.

 తెలంగాణలోనే పర్యాటక జిల్లాగా పేరొందిన ములుగులో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్, లక్నవరం, రామప్ప సరస్సులు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, మల్లూరు హేమాచలక్షేత్రం, ఏటూరునాగారం అభయారణ్యం, తెలంగాణ నయాగారా బొగత జలపాతం వంటి ఎన్నో  పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.  వీటితో పాటు బ్లాక్​బెర్రీ క్యాంపు కూడా అందుబాటులోకి రానుంది.  

సెలయేటి ఇసుకలో గుడారాలు 

తాడ్వాయి మండలం మొండ్యాల తోగు సెలయేటి ద్వారా మేట వేసిన ఇసుకలో బ్లాక్​ బెర్రీ క్యాంపును అటవీ శాఖ నిర్మించింది.  ఎకో టూరిజంలో భాగంగా బ్లాక్​బెర్రీ పేరిట మోడ్రన్ గా 50 గుడారాలను రూ.కోటి నిధులతో ఏర్పాటు చేసింది. వాగు మధ్యలో ఇసుక మేటల్లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకులకు సౌకర్యాలను కల్పించింది. గతేడాది మంత్రులు సీతక్క, సురేఖ ప్రారంభించారు. 

ఇక్కడ రాత్రివేళ కూడా పర్యాటకులు స్టే చేయొచ్చు.  క్యాంపు ఫైర్​ ఉంది.  బీచ్ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ వంటి ఆటలు ఆడుకోవచ్చు. చిన్నారులు గేమ్స్​ఆడుతూ ఎంజాయ్ చేసేలా సదుపాయాలు కల్పించారు. ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండేలా గుడారాలను నిర్మించారు. ఒక రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం చెక్ ​ఔట్ చేసే వరకు రూ.2,500 చొప్పున చార్జ్ చేస్తారు. పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా అటవీ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.

వాగులు ఉప్పొంగడంతో బంద్  

బ్లాక్ ​బెర్రీ క్యాంపును వారంలో ఓపెన్ చేసేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది వర్షాకాలంలో వాగులు ఉప్పొంగడంతో క్యాంపును తొలగించారు. వింటర్ లో తిరిగి గుడారాలు, హోటళ్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక గుట్టను ఆనుకొని మంచెను కూడా నిర్మించారు. దానిపైకి ఎక్కి అటవీ అందాలను వీక్షించవచ్చు. 

బిజీ లైఫ్ నుంచి ప్రశాంతంగా, ఉల్లాసంగా గడిపేందుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీకెండ్స్ లో వస్తుంటారు. వారికి బ్లాక్​ బెర్రీలో స్టే చేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రస్తుతం క్యాంపు పనులు పూర్తి కావస్తున్నాయని, వారంలో అందుబాటులోకి తెస్తామని వైల్డ్​ లైఫ్ రేంజ్​ ఆఫీసర్ భాస్కర్ గౌడ్​తెలిపారు.  బ్లాక్​ బెర్రీ క్యాంపు ఓపెనింగ్ కోసం పర్యాటకులు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.