నూతన బిల్లుతో..ఉన్నత విద్యా దశ మారాలి!

నూతన బిల్లుతో..ఉన్నత విద్యా దశ మారాలి!

ఏ దేశమైనా దీర్ఘకాలిక అభివృద్ధిపథంలో ముందుకు సాగాలంటే ఆ దేశ విద్యావ్యవస్థ బలంగా ఉండటం అత్యవసరం.  ముఖ్యంగా ఉన్నత విద్య దేశాన్ని  జ్ఞానాధారిత ఆర్థికవ్యవస్థగా మలిచే కీలక సాధనంగా నిలుస్తుంది. భౌతిక వనరులు ఎంత సమృద్ధిగా ఉన్నా,  మేధస్సు, ఆలోచనా స్వేచ్ఛ, ఆవిష్కరణలతో కూడిన మానవ వనరులు లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో భారతదేశం  జాతీయ సంకల్పాన్ని సాకారం చేసుకోవాలంటే,  ఉన్నత విద్యా రంగంలో సమూలపోకడల మార్పులు అవసరం.  ఆ దిశగా  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్​సభలో  ప్రవేశపెట్టిన 'వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్-2025' బిల్లు భారత ఉన్నత విద్యా చరిత్రలో మైలురాయి కానుందా! 

1956లో యూనివర్సిటీ గ్రాంట్స్  కమిషన్ (యూజీసీ) ఏర్పాటుతో  విశ్వవిద్యాలయాలకు నిధుల పంపిణీ,  ప్రమాణాల స్థాపనకు ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పడింది.  ఆపై సాంకేతిక విద్య విస్తరణ నేపథ్యంలో 1987లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య కోసం 1993లో  నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలు ఆవిర్భవించాయి.  ఆయా దశల్లో ఇవి విద్యా విస్తరణకు తోడ్పడ్డప్పటికీ,  కాలక్రమేణా ప్రపంచీకరణ,  డిజిటలీకరణ,  నాలుగో పారిశ్రామిక విప్లవం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బహుళ నియంత్రణ వ్యవస్థలు విద్యాసంస్థలపై అదనపు భారంగా మారాయి.ఎన్ఈపీ-2020 పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన విద్యాసంస్థలు  పరిపాలనా ప్రక్రియలలో చిక్కుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.  ఫలితంగా భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచస్థాయి ర్యాంకింగ్స్​లో   వెనకబడ్డాయి. ఈ లోపాలను  గుర్తించిన  నేపథ్యంలోనే 2020లో  కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ( ఎన్ఈపీ -2020)ను  ప్రకటించింది.  ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్  కె. కస్తూరి రంగన్  నేతృత్వంలోని  కమిటీ రూపొందించిన ఈ విధానం, భారతీయ విద్యా వ్యవస్థను సమూలంగా పునర్మించేందుకు ఒక దార్శనిక ప్రయత్నం చేసింది.  జాతీయ విద్యావిధానం  ప్రతిపాదించినది   ‘మితిమీరిన  నియంత్రణకు బదులు ప్రభావవంతమైన పర్యవేక్షణ’ అనే సిద్ధాంతం. విద్యాసంస్థలకు ఆలోచనా స్వేచ్ఛ,  స్వయంప్రతిపత్తి ఇవ్వాలి.  అయితే నాణ్యత విషయంలో  రాజీ పడకూడదు అనే స్పష్టమైన దృక్పథమే దీనిలో ఉంది.  అదే ఆలోచనకు చట్టబద్ధమైన రూపమే 'వికసిత్  భారత్ శిక్షా అధిష్టాన్- 2025' బిల్లు.  ఇది విద్యారంగాన్ని నియంత్రణల గజిబిజి నుంచి విముక్తం చేసి, నాణ్యత,  జవాబుదారీతనం, స్వేచ్ఛ అనే మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించేందుకు రూపొందించినట్లు అర్థమవుతుంది. 

విద్యారంగ సమస్యలు

ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ ఒక అత్యున్నత గొడుగు సంస్థగా వ్యవహరిస్తుంది.  ఇప్పటివరకు  వేర్వేరుగా పనిచేసిన యూజీసీ,  ఏఐసీటిఈ,  ఎన్సీటీఈ  వంటి నియంత్రణ సంస్థలను ఇందులో విలీనం చేయడం ద్వారా విద్యా పరిపాలనలో  ఏకీకృత  దృక్పథం ఏర్పడుతుంది.  ముఖ్యంగా ప్రమాణాల నిర్దేశం,నియంత్రణ  అమలు,   నాణ్యతా మూల్యాంకనం వంటి బాధ్యతలను వేర్వేరు మండళ్లకు అప్పగించడం ద్వారా బాధ్యతల స్పష్టత వస్తుంది.  దీనివల్ల  పారదర్శకమైన,  సమర్థవంతమైన పరిపాలన సాధ్యమవుతుంది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని యూనియన్ జాబితా ఎంట్రీ 66 ప్రకారం, ఉన్నత విద్యలో ప్రమాణాల సమన్వయం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ బిల్లు ఆ రాజ్యాంగాత్మక సూత్రాన్ని గౌరవిస్తూ..  కేంద్రం, -రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది. రాష్ట్రాల పాత్రను తగ్గించకుండా, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక సమగ్ర విద్యా చట్రాన్ని రూపొందించడమే దీని లక్ష్యం. 

 కేంద్ర బిందువుగా సాంకేతికత

 సాంకేతికతను కేంద్ర బిందువుగా చేసుకొని పారదర్శకతను పెంపొందించడం ఈ సంస్కరణలలో మరో ముఖ్యాంశం. 'ముఖాముఖి రహిత' విధానం వల్ల మానవ జోక్యం తగ్గి,  అవినీతి అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల విద్యాసంస్థలు పరిపాలనా భారాల నుంచి విముక్తమై, బోధన, పరిశోధన, ఆవిష్కరణలపై  పూర్తిస్థాయిలో  దృష్టి పెట్టగలుగుతాయి.  ఇది విద్యావ్యవస్థలో విశ్వాసాన్ని పెంచే అంశంగా నిలుస్తుంది.   స్థూల నమోదు నిష్పత్తి పెంపు ద్వారా ఉన్నతవిద్య మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తుంది.  బహుళశాఖ విద్య, కోర్సుల మధ్య సరళమైన మార్పులు విద్యార్థుల ఆసక్తులు, ప్రతిభలకు అనుగుణంగా విద్యను మలుస్తాయి. పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్ సంస్కృతికి  ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  యువతను కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థితి నుంచి, ఉద్యోగాలు  సృష్టించే స్థితికి తీసుకెళ్లే  అవకాశం కలుగుతుంది. బలమైన ఫిర్యాదుల పరిష్కార 
వ్యవస్థ విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

ఇదొక ప్రయత్నం

వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్- 2025 ఒక సాధారణ చట్ట సవరణ కాదు.  అది భారతీయ విద్యా వ్యవస్థ ఆత్మను మేల్కొలిపే ఒక ప్రయత్నం.  ప్రాచీన నలంద, తక్షశిలల జ్ఞాన వారసత్వాన్ని ఆధునిక సాంకేతికత,  ప్రపంచ దృష్టితో  మేళవిస్తూ 2047 నాటికి భారత్​ విద్యలో సంపూర్ణ వికసిత దేశంగా మార్చేందుకు ఈ సంస్కరణలు  ఉపయోగపడతాయని  విద్యావేత్తలు భావిస్తున్నారు.  జ్ఞానమే శక్తి అనే సత్యాన్ని ప్రపంచానికి మరోసారి నిరూపించే అవకాశాన్ని ఈ బిల్లు భారతదేశానికి అందిస్తే అంతకు మించి కావల్సిందేముంది!

భారతీయ విద్య అంతర్జాతీయీకరణ దిశగా..

అంతర్జాతీయ స్థాయిలో ఈ బిల్లు ప్రభావం గణనీయంగా ఉండనుంది. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను భారతదేశంలోకి ఆహ్వానించడం,  భారతీయ  విద్యాసంస్థలను గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా మేధో వలసను తగ్గించవచ్చని భావిస్తున్నారు.  స్టడీ ఇన్ ఇండియా అనే భావనను వాస్తవంగా అమలు చేయడానికి ఈ బిల్లు బలమైన పునాది వేసే అవకాశం ఉంది.  దీని ద్వారా భారత్ ప్రపంచ జ్ఞాన ఆర్థికవ్యవస్థలో కీలక పాత్రధారిగా ఎదగగలదని విద్యావంతుల అభిప్రాయంగా తెలుస్తోంది.

- డా. రావుల కృష్ణ,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
హెచ్​సీయూ