- బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణపైనే
- ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం
- నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లలో
- జాతీయ పార్టీలు ఢీ అంటే ఢీ మంత్రులు సహా పూర్తి కేడర్‌తో మోహరించిన కాంగ్రెస్
- దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ
- ఇక్కడ 100% మున్సిపాలిటీలేలక్ష్యంగా వ్యూహాలు
- సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ ముఖ్యనేతల ఫోకస్
- సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలనే పరిస్థితి
- రసవత్తరంగా మున్సిపోల్స్
నెట్వర్క్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు నేరుగా తలపడ్తున్నప్పటికీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ.. నార్త్‌లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతున్నది. బీజేపీ.. ప్రధానంగా ఉత్తర తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్అయింది. ఆ రెండు కార్పొరేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారకుండా ఇన్చార్జ్ మంత్రులను రంగంలోకి దించి, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది.
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తుందన్న అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం రేవంత్.. ఇప్పటికే అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్‌లో ప్రచార సభలు నిర్వహించి, ఆ రెండు పార్టీలూ ఒకే టాను ముక్కలని చెప్పే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి ఓటేసినా మూసీలో వేసినట్లేనని కుండబద్ధలుకొట్టారు. అటు దక్షిణ జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి తమకు నామమాత్రపు పోటీ ఉందని భావిస్తున్న అధికారపార్టీ.. 100శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లతో కూడిన పూర్తి కేడర్‌ను మోహరించింది. ఈ క్రమంలో 3 రోజులుగా హైదరాబాద్‌లోని గాంధీభవన్వెలబెలబోతున్నది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఫామ్హౌస్కే పరిమితం కావడంతో ప్రచార భారమంతా కేటీఆర్, హరీశ్‌రావుపైనే పడింది. ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్పరిస్థితి తయారైంది. అటు హరీశ్‌రావు, ఇటు కేటీఆర్.. ఈ 3 మున్సిపాలిటీలపైనే ప్రధానంగా ఫోకస్పెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటపడిన కవిత.. నాన్న కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీశ్‌రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తుండడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది.
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
ఉత్తర తెలంగాణలోని పలుచోట్ల బీజేపీ, కాంగ్రెస్ నడుమ ఢీ అంటే ఢీ అన్నట్లుగా పరిస్థితి ఉన్నది. నార్త్‌లోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎంపీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్‌నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురి చొప్పున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎమ్మెల్యే ల్లో ఏడుగురు ఉత్తర తెలంగాణ జిల్లాలవారే దీంతో కేంద్రమంత్రి బండి సంజయ్, నిజామాబాద్ఎంపీ అర్వింద్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులంతా వారి వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్‌తో బరిగీసి కొట్లాడుతున్నారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కీలకమైన నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లతోపాటు 42 మున్సిపాలిటీల పరిధిలో 1,235 వార్డులున్నాయి. బీజేపీకి అంతగా బలం లేని వరంగల్‌ఉమ్మడి జిల్లాను పక్కనపెడ్తే మిగిలిన 3 జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కమలం పార్టీ నేతలు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్, ఎంపీ అర్వింద్ నిజామాబాద్ కార్పొరేషన్, ఎంపీ నగేశ్ఆదిలాబాద్ తోపాటు ఇతర మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా తమ భుజస్కందాలపై వేసుకొని ముందుకెళ్తున్నారు.
మహిళా ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్
అధికార కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనా రిటీ ఓటు బ్యాంకును నమ్ముకుంది. మహిళల ఓట్లు కూడా గంపగుత్తగా పడ్తాయని భావిస్తున్నది. కాగా, దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలం గాణలో బీజేపీ, బీఆర్ఎస్ కారణంగా త్రిముఖ పోటీ ఉంటుందని, దీని వల్ల తమకే లాభం జరుగుతుందని కూడా కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ లాంటి కార్పొరేషన్లలో మెజారిటీకి కొన్ని సీట్లు తక్కువ వచ్చినా ఎంఐఎం సపోర్ట్‌తోపాటు ఎక్స్అఫిషియో ఓట్లతో గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. కాగా, ఎంఐఎం, ఎక్స్అఫిషియోపైనే ఆశలు పెట్టుకోవద్దని, ఆయాచోట్ల క్లియర్ మెజారిటీ రావాల్సిందేనని సీఎం ఆదేశించడంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఉత్తమ్, తుమ్మల, జూపల్లి కృష్ణారావుతోపాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ లోకల్‌గా అడ్డావేసి విజయ వ్యూహాలు రచిస్తున్నారు.
సౌత్లో కాంగ్రెస్ దూకుడు..
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన తమకు తిరుగులేదనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపు నల్లేరుమీద నడకేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దక్షిణ జిల్లాల్లో ఆ పార్టీకి భారీ ఓటు బ్యాంకు ఉంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాలు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నాయి. ఈ సారి సౌత్‌లోని 74 మున్సిపాలిటీలు, నల్గొండ, మహబూబ్‌నగర్, భద్రాధ్రి కొత్తగూడెం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీకి చెందిన రఘునందన్‌రావు మెదక్ ఎంపీగా, డీకే అరుణ మహబూబ్‌నగర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో తమ కమలం పార్టీ అభ్యర్థుల గెలుపోటముల బాధ్యతలు వీరిద్దరూ తమ భుజస్కంధాలపై వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబీన్తో మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్‌లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్..దక్షిణ జిల్లాల్లో నేటికీ కోలుకోలేదు. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని భావిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై మంత్రులు వివేక్‌వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్స్పెషల్ ఫోకస్‌పెట్టారు.
సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్నేతల దృష్టి..
గత మున్సిపల్ ఎన్నికల్లో 110 మున్సిపాలిటీలను, పదికి పది కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్.. తాజా ఎన్నికల్లో ఎదురీదుతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడంతో కేటీఆర్, హరీశ్‌రావులే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటపడి వేరు కుంపటి పెట్టిన కవిత.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం మొదలుకొని ఫోన్‌ట్యాపింగ్ వరకు ఏ ఒక్క అంశాన్నీ వదలకుండా ప్రతిపక్షాలకు దీటుగా బీఆర్ఎస్ను ఎండగడ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది పార్టీ మారగా, ఇద్దరు చనిపోవడంతో ఇక మిగిలింది 27 మంది మాత్రమే. కానీ అధికారం లేకపోవడంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మినహా మున్సిపల్‌ఎన్నికల్లో మిగిలినవారి ప్రభావం అంతంతే ఉంది. అటు హరీశ్, ఇటు కేటీఆర్సొంత సెగ్మెంట్లకే ఎక్కువ సమయం కేటాయిస్తుండడంతో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కార్పొరేషన్లలో ఇదీ పరిస్థితి..
- కరీంనగర్ కార్పొరేషన్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ కన్నేశారు. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం దాకా అంతా తానై చక్రం తిప్పుతున్నారు. 66 డివిజన్లకుగాను 20నుంచి 25 డివిజన్లలో బీజేపీ, 15 నుంచి 20 డివిజన్లలో కాంగ్రెస్, 10 నుంచి 15 డివిజన్లలో బీఆర్ఎస్, 6 నుంచి 8 చోట్ల ఎంఐఎం, 3 నుంచి 6 డివిజన్లలో ఇండిపెండెంట్లు, ఒక డివిజన్‌లో ఫార్వర్డ్ బ్లాక్ గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుత విశ్లేషణల ప్రకారం ఇక్కడ ఏ రెండు పార్టీలు కలవకుండా మేయర్ పీఠం దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
- నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో 28 డివిజన్లు గెలిచినా బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక పోయింది. దీంతో ఈసారి టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే కమలం పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. అవినీతి ఆరోపణలు వచ్చిన 18 మందిని పక్కన బెట్టింది. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో బీజేపీ హిందుత్వ నినాదంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నది. ఇటు కాంగ్రెస్ నుంచి ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ ఇందూరులో మోహరించి, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. 20 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో 16 చోట్ల గెలిచిన ఎంఐఎం ఈసారి ఆ సీట్లు గెలిస్తే వారి మద్దతుతో కార్పొరేషన్‌లో పాగా వేయవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది.
- నల్గొండ కార్పొరేషన్‌లో 48 వార్డులుండగా, 30 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆయా చోట్ల బలమైన అభ్యర్థులు ఉండడమే ఇందుకు కారణం. బీజేపీ, బీఆర్ఎస్కలిసినా 10 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదంటున్నారు. మరోవైపు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలోనే అడ్డా వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.
- మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంది. ఇక్కడ 60 డివిజన్లు ఉండగా.. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న 16 చోట్ల ఎంఐఎం బరిలో నిలిచింది. కాంగ్రె స్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కిం చుకునే చాన్స్ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
- కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొ న్నది. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలున్నా.. సీపీఐ నుంచి గట్టి పోటీ ఎదుర వుతున్నది. అధికారపార్టీలో నాయకత్వలోపం, బీఆర్ఎస్, సీపీఐ నడుమ లోపాయికారీ పొత్తు లు.. కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.
- మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నది. ఇక్క డ 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ కు 40 డివిజన్ల లో విజయావకాశాలు ఉన్నాయి. కాగా, బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఈ సంఖ్యపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నా మేయర్‌పీఠం మాత్రం కాంగ్రెస్‌కే దక్కే అవకాశముంది.
- పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో 60 డివిజన్ల ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ 35 నుంచి 45 వరకు సీట్లు గెలిచి మేయర్‌పీఠాన్ని దక్కించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. చాలాచోట్ల బీఆర్ఎస్నుంచి బలహీన అభ్యర్థులు ఉండడం కాంగ్రెస్‌కు కలిసిరానున్నది.
