వెలుగు ఓపెన్ పేజీ: డిజిటల్ డేటా డీసెంట్ దొంగతనం

వెలుగు ఓపెన్ పేజీ:  డిజిటల్ డేటా డీసెంట్ దొంగతనం

భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యతను వ్యాపార సరుకుగా మారుస్తున్న టెక్ దిగ్గజాల ఆగడాలకు అత్యున్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది.మెటా సంస్థ అనుసరిస్తున్న తీరును 'డీసెంట్ దొంగతనం'గా అభివర్ణించడం కేవలం వ్యాఖ్య మాత్రమే కాదు, అది భారత పౌరుల డిజిటల్ సార్వభౌమత్వానికి రక్షణ కవచం. 2026 ఫిబ్రవరి 3న భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వాట్సాప్ తన వినియోగదారుల డేటాను ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ వంటి తన ఇతర అనుబంధ సంస్థలతో పంచుకోవడాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించగా ధర్మాసనం సంధించిన ప్రశ్నలు వారి పునాదులను కదిలించాయి. ఈ చర్యను డీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తున్న దొంగతనం అని కోర్టు పేర్కొనడం వెనుక బలమైన న్యాయపరమైన తర్కం దాగి ఉంది. కేవలం  లాభార్జనే  ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రైవేట్  సమాచార  దోపిడీని అరికట్టకపోతే  పౌరస్వేచ్ఛకు అర్థమే ఉండదు.


గతంలో 2021లో వాట్సాప్  తన  ప్రైవసీ పాలసీని మార్చినప్పుడు ‘Take-it- or- leave-it’ అనే కఠినమైన  షరతును పెట్టింది. అంటే, వారి విధానాలకు అంగీకరిస్తేనే సర్వీసు ఉంటుంది, లేదంటే యాప్ వాడటం మానేయాలి. ఇది రెండు సమాన పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ఎంతమాత్రం కాదు. ఇది ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదారులను నిర్బంధించే పత్రం మాత్రమే. భారత పౌరులకు ఎంచుకునే స్వేచ్ఛ లేకుండా, బలవంతంగా అంగీకరించేలా చేయడం రాజ్యాంగబద్ధమైన పౌర హక్కులను కాలరాయడమే అవుతుంది. ఈ అసమాన ఒప్పందాలను రాజ్యాంగవాదానికి  అపహాస్యంగా  కోర్టు అభివర్ణించింది. రాజ్యాంగవాదం అంటే కేవలం చట్టం ఉండటం కాదు, అది పౌరుడిని శక్తిమంతుడిగా మార్చే రక్షణ కవచం. టెక్ కంపెనీల నిరంకుశత్వం ఈ మూల సూత్రానికి విరుద్ధంగా సాగుతోంది. రాజ్యాంగం మనకు ప్రైవసీని ప్రాథమిక హక్కుగా ఇచ్చింది.  కానీ  టెక్ కంపెనీలు తమ వ్యాపార లాభాల కోసం పౌరుల వ్యక్తిగత అలవాట్లను, పరిచయాలను వేలం వేస్తున్నాయి. 

రాజ్యాంగవాదానికి సవాలు

సుప్రీంకోర్టు వాడిన 'సింహం-–గొర్రె' ఉపమానం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. మెటా వంటి ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యం ముందు సామాన్య పౌరుడు ఒక గొర్రెలా నిస్సహాయంగా నిలబడాల్సి వస్తోంది.  ఆకలితో  ఉన్న సింహం గొర్రెతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో, మెటా కంపెనీ డేటా విధానాలు కూడా అలాగే ఉన్నాయి. సామాన్య పౌరులకు ఈ సాంకేతిక చిక్కుముడులు అర్థం కావు. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, 'సమ్మతి'  అనే ముసుగులో డేటాను తరలించడం నైతికంగానూ, చట్టపరంగానూ నేరం. ప్రజల వ్యక్తిగత  సంభాషణల సమాచారం ఎక్కడ భద్రంగా ఉంటుంది? ఈ ప్రశ్నకు జవాబులు లేనిచోట పౌరుల  భద్రత గాలిలో  దీపమే అవుతుంది. 

డేటా ఆధిపత్యం - ఆర్థిక శిక్షలు

భారత కాంపిటీషన్ కమిషన్ (CCI) మెటాపై విధించిన రూ.213.14 కోట్ల జరిమానా కేవలం ఆర్థికపరమైన శిక్ష కాదు, అది ఒక గట్టి హెచ్చరిక. వాట్సాప్ తన గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని, ఇతర మెటా అప్లికేషన్ల ప్రయోజనం కోసం డేటాను మళ్లించడం పోటీ చట్టాల ఉల్లంఘన కిందికే వస్తుంది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఆయుధంగా మలచుకుని మార్కెట్ ఆధిపత్యం చలాయించడం అంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అంతం చేయడమే. ఈ డేటా మొనోపలీ  మార్కెట్లోని చిన్న చిన్న సంస్థలను అణచివేస్తూ, పోటీ వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. మెటా కంపెనీ వ్యాపార మోడల్ మొత్తం డేటా సేకరణ మీద ఆధారపడి ఉంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనకు ఏం ఇష్టం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే సమాచారాన్ని విశ్లేషించి ప్రకటనల ద్వారా వారు బిలియన్ల కొద్దీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ లాభార్జన ప్రక్రియలో పౌరుడి గౌరవానికి తావు లేకుండా పోయింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే గోప్యత హక్కు ఉంటుంది, మరి మన డేటాను దొంగిలిస్తున్నప్పుడు ఆ హక్కుకు రక్షణ ఎక్కడుంది? కేవలం జరిమానాలతో ఈ దిగ్గజాల ధోరణి మారుతుందా? 

అంతర్జాతీయ భద్రత

అంతర్జాతీయంగా మెటాకు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికాలో దాఖలైన క్లాస్ యాక్షన్ కేసులు ఒకవైపు, వాట్సాప్ క్లెయిమ్ చేస్తున్న 'End-to-End Encryption' పై వస్తున్న అనుమానాలు మరోవైపు వారి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. మెటా కొత్తగా ప్రవేశపెట్టిన సెక్యూరిటీ లేయర్లు, ఫోటో ప్రొటెక్షన్ ఫీచర్లు పౌరుల డేటాను రక్షించడానికా లేక న్యాయస్థానాల నుండి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమా అనే అనుమానం కలగకమానదు. యూరోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జిడిపిఆర్​తో పోల్చి చూస్తే భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిస్థితి దయనీయంగా ఉంది. యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ తన ఇష్టానుసారం డేటాను తరలించలేకపోయింది. బ్రిటిష్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ డేటా లీక్ కేసులో భారీ జరిమానాలు పడ్డాయి. గూగుల్ మీద కూడా కఠినమైన పెనాల్టీలు విధించారు. అక్కడ చట్టాలు పౌరుడిని కేంద్రంగా ఉంచుతాయి. యూరప్ పౌరుడికి తన డేటాపై పూర్తి యాజమాన్య హక్కు  ఉంది. కానీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన డేటా ప్రొటెక్షన్ చట్టం ఇంకా సరిగా  రూపుదిద్దుకోకపోవడం విచారకరం. మన దేశంలో కూడా డేటా సార్వభౌమత్వ చట్టాలు వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. 

డేటా అంటే ఆధునిక కాలపు చమురు!

డేటా అనేది ఆధునిక కాలపు చమురు వంటిది. ఆ నిక్షేపాలు భారత పౌరుల వ్యక్తిగత జీవితాల్లో ఉన్నాయి. దాన్ని దోచుకుంటున్న కంపెనీలు తాము చట్టాలకు అతీతం అని భావించకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ గట్టి హెచ్చరికతోనైనా భారత ప్రభుత్వం మేల్కొని, డిజిటల్ భారతాన్ని దోపిడీ రహిత భారతంగా మార్చాలి. పౌరులారా, మీ డేటా మీ హక్కు, అది ఎవరో అమ్ముకునే సరుకు కాదు. మన డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఇది ఆఖరి అవకాశం. సాంకేతికత అనేది మానవ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉండాలి కానీ, మనిషిని కేవలం ఒక డేటా ఎంట్రీగా మార్చడానికి కాదు. గోప్యత లేని సమాజం పారదర్శకమైన జైలు వంటిది. రాజ్యాంగబద్ధమైన మన హక్కులను కాపాడుకోవడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, భవిష్యత్ తరాలు డిజిటల్ బానిసత్వంలో మగ్గాల్సి వస్తుంది. పౌర హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు చేస్తున్న పోరాటంలో మనం కూడాభాగస్వాములం కావాలి.

 భద్రత ముసుగులో జరుగుతున్న వింతలు

వాట్సాప్ నిరంతరం మేం మీ సందేశాలు చదవం అని చెబుతుంది,  కానీ మన మెటా డేటా ద్వారా మన వ్యక్తిత్వాన్ని వాళ్ళు సులభంగా అంచనా వేయగలరు. భద్రత పేరుతో కొత్త ఫీచర్లు విడుదల చేయడం కేవలం దృష్టి మళ్లించే చర్య మాత్రమే.  భారత పౌరుల ఆంతరంగిక సమాచారాన్ని విదేశీ సర్వర్లలో  నిక్షిప్తం చేసి,  కృత్రిమ మేధస్సు సాయంతో విశ్లేషించడం ద్వారా ప్రజల ఆలోచనా ధోరణులను కూడా మార్చే ప్రమాదం ఉంది. ఇది ఒక రకమైన డిజిటల్ వలసవాదం. అగ్రరాజ్యాల్లో అమలవుతున్న నియమాలు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పలచబడుతున్నాయి? టెక్ కంపెనీల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనం కాదా?

పరిష్కార మార్గం

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు అతిక్రమిస్తే సేవలను నిలిపివేసే అధికారం రెగ్యులేటరీలకు ఉండాలి.  విదేశీ టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు స్వదేశీ డిజిటల్ వేదికలను ప్రభుత్వం చైనా తరహా ప్రోత్సహించాలి. యూరోపియన్ మోడల్ తరహాలో వినియోగదారుడికి తన డేటాను ఎప్పుడైనా వెనక్కి తీసుకునే లేదా తొలగించుకునే హక్కు కచ్చితంగా ఉండాలి. 'అంగీకరిస్తేనే సర్వీసు' అనే బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్ విధానాన్ని ప్రభుత్వం చట్టబద్ధంగా నిషేధించాలి. పౌరులకు తమ సమాచారంపై పూర్తి నియంత్రణ ఉండాలి. కంపెనీలు సేకరించే ప్రతి డేటా పాయింట్ ఎందుకు సేకరిస్తున్నారు,  దాన్ని ఎలా వాడుకుంటారు అనే విషయంలో  పూర్తి పారదర్శకత అవసరం.  చట్టం  అనేది కేవలం కాగితాల మీద ఉంటే సరిపోదు, అది అమలులోతన ప్రతాపాన్ని చూపాలి.

- డా.కట్కూరి 
సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు