- పశుసంవర్థక శాఖ మంచిర్యాల
- ఇన్‌చార్జ్ జేడీ శంకర్ నిర్వాకం
- ఆమె హోదాకు మించి ఏడీ చాంబర్ కేటాయింపు
- ఆఫీసులో పెత్తనమంతా మేడమ్‌దే అంటున్న ఉద్యోగులు
- నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులు
- నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణ
- సోదాల్లో 80 తులాల బంగారం గుర్తింపు!
- ఇన్‌చార్జ్ జేడీ బాధ్యతల నుంచి శంకర్ తొలగింపు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో వెటర్నరీ అండ్ యానిమల్హజ్బెండరీ డిపార్ట్మెంట్ పూర్తిగా గాడి తప్పింది. ఆ శాఖ ఇన్‌చార్జ్ జేడీ శంకర్.. తన పవర్, పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కింది స్థాయి అధికారులను, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా ఆయనను నాలుగు రోజులుగా ఆదిలాబాద్ఏసీబీ డీఎస్పీ మధు, అధికారులు విచారిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, అవినీతిపై ఫిర్యాదులు అందడంతో.. వాటిపై కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉండగా శంకర్ వ్యవహార శైలి ఆ శాఖలో వివాదాస్పదంగా మారింది.
పెత్తనమంతా ఆమెదే
శంకర్ భార్య విజయభారతి అదే విభాగంలో వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ (వీఎల్‌ఓ). దండేపల్లి మండలం చింతపల్లి సబ్‌సెంటర్‌లో ఆమెకు పోస్టింగ్ఇచ్చారు. అయితే శంకర్ తన పవర్, పలుకుబడితో భార్యను డిప్యుటేషన్‌పై తన ఆఫీసుకు తెచ్చుకున్నారు. ఆమె హోదాకు మించి తన చాంబర్ పక్కనే ఖాళీగా ఉన్న ఏడీ చాంబర్‌ను కేటాయించారు. నిజానికి మంచిర్యాలలో జేడీ, ఏడీ రెండు పోస్టులు ఉన్నాయి. జేడీ పోస్టు ఖాళీగా ఉండడంతో ఏడీగా ఉన్న శంకర్‌కు ఇన్‌చార్జ్ జేడీగా బాధ్యతలు అప్పగించారు. ఈ పోస్టులో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఆయన ‘ఆడింది ఆట... పాడింది పాట’ అన్నట్టు నడుస్తోంది. వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్(వీఎల్‌ఓ) గా పశువుల ఆరోగ్యాన్ని నిర్ధారించడం, వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా టీకాలు వేయడం, చికిత్స చేయడం విజయభారతి డ్యూటీ. కానీ ఆమె తన భర్త చాంబర్పక్కనే ఏడీ చాంబర్‌లో కూర్చొని అధికారులు, ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడం కంటే పెద్ద హోదాలో గల వెటర్నరీ డాక్టర్ల నుంచి సూపరింటెండెంట్వరకు ఆమె ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. పైగా తన అధికార పరిధి దాటి ఇన్‌స్పెక్షన్ల పేరిట వెటర్నరీ డాక్టర్లను పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నట్టు తెలిసింది. ఈ దంపతుల తీరుపై ఉడికిపోతున్న ఉద్యోగులు వారి అవినీతి, నిధుల దుర్వనియోగంపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
మద్యం, బంగారం, స్థిరాస్తులు
డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా ఏసీబీ అధికారులు జేడీ శంకర్‌తో పాటు ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను నాలుగు రోజులుగా విచారిస్తున్నారు. గత మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు మంచిర్యాల రాంనగర్‌లోని శంకర్నివాసంలో డీఎస్పీ మధు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మరోవైపు కలెక్టరేట్‌లోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లను విచారించారు. శంకర్ నివాసంలో 42 ఖరీదైన లిక్కర్బాటిల్స్ లభించడంతో ఎంక్వైరీ కోసం ఎక్సైజ్అధికారులకు అప్పగించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ శామీర్‌పేటలోని నివాసంలో సోదాలు చేపట్టారు. మంచిర్యాలలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోని లాకర్‌ను ఓపెన్ చేసి చూశారు. అందులో 30 తులాలు, ఇంట్లో 25 తులాలు, గోల్డ్లోన్అకౌంట్లో మరో 25 తులాలు కలిపి మొత్తం సుమారు 80 తులాల బంగారం లభించినట్టు సమాచారం. శుక్రవారం జేడీ శంకర్, ఆయన భార్య విజయభారతితో పాటు జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లను, ఆఫీసులో పనిచేస్తున్న 8 మంది ఔట్‌సోర్సింగ్‌సిబ్బందిని నస్పూర్‌లోని ఏసీబీ ఆఫీసుకు పిలిచి ఎంక్వైరీ జరిపారు. ఏసీబీ సోదాల్లో గోల్డ్, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఏసీబీ అధికారులు ధ్రువీకరించడం లేదు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు రిపోర్ట్ఇస్తామంటూ వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు.
ఇన్‌చార్జ్ జేడీగా యాకూబ్ రెడ్డి
ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న శంకర్‌ను ఇన్‌చార్జ్ జేడీగా తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికాఋరులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో లక్సెట్టిపేట ఏడీ యాకూబ్‌రెడ్డికి ఇన్‌చార్జ్ జేడీగాబాధ్యతలు అప్పగించారు.
మేడమ్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు
జేడీ శంకర్భార్య, వీఎల్‌ఓ విజయభారతి మొన్నటి రిపబ్లిక్ వేడుకల సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ అవార్డుల కోసం ఉద్యోగుల పేర్లను ఆయా డిపార్ట్మెంట్ల హెచ్‌ఓడీలు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తుంటారు. ఇదే అదునుగా శంకర్ తన భార్యకు ఉత్తమ అవార్డు ఇప్పించుకున్నారు. ఆమె చింతపల్లి సబ్‌సెంటర్‌లో పశువులకు టీకాలు వేయడం, ట్రీట్‌మెంట్ చేయడం వంటి విధులు నిర్వహిస్తూ రైతుల సేవలో తరిస్తుంటే ఉత్తమ అవార్డుకు ఎంపిక చేయాలి. కానీ, భర్త అధికారాన్ని అడ్డంపెట్టుకొని జిల్లా పశుసంవర్థక శాఖ ఆఫీసులో పెత్తనం చేస్తున్నందుకు అవార్డు ఇచ్చినట్టుందని చర్చించుకుంటున్నారు.
భారీగా కమీషన్లు, లంచాలు
పైకి చాలా హుందాగా కనిపించే జేడీ శంకర్.. అవినీతిలో బాగానే ఆరితేరినట్టు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల గాలికుంటు టీకాలు 6 స్పెల్‌కు సంబంధించిన బిల్లు రూ.50 లక్షలు వెటర్నరీ డాక్టర్లకు రిలీజ్ అయ్యాయి. అందులో 16% కమీషన్ తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పశుసంవర్థక శాఖకు చెందిన బొలెరో (టీఎస్01ఏఈ 0022) వెహికల్‌ను ట్రాన్స్‌పోర్టు కోసం వినియోగించి ఆ బిల్లుల్లో 25 శాతం కమీషన్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇలా సుమారు రూ.8 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. పలువురు డాక్టర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపగా, సంబంధిత ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది.ఉద్యోగుల డిప్యుటేషన్ల విషయంలోనూ శంకర్ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
