- గత అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్స్.. ఇప్పుడు ఒక్కటైన్రు
- మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు
ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల వేళ చేతులు కలిశాయి.. విభేదాలను పక్కనపెట్టి విజయమే కావాలంటూ ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు ఒక్కటైన్రు. ఇన్నేండ్లు రెండు వర్గాలు ఉన్నవారు ఇప్పుడు ఐక్యంగా ఎన్నికల ప్రచారం చేస్తుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీనియర్ లీడర్లు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేశారంటూ అధిష్టానం వారిని సస్పెండ్ చేసింది.
కొత్తగా వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ఇవ్వడంతో ఈ ముగ్గురు నేతలు రెబెల్స్ గా మారారు. సంజీవ్ రెడ్డిని ఎన్నికల్లో నిలబెట్టారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వీరు మళ్లీ పార్టీలో చేరేందుకు పలుమార్లు ప్రయత్నించారు. చివరకు రెండేండ్ల తర్వాత ఇటీవల వారి సస్పెన్షన్ ను అధిష్టానం ఎత్తివేసింది. కాగా, ఇప్పటివరకు కంది వర్గంతో ఈ ముగ్గురూ అంటీముట్టినట్టుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వచ్చిన మున్సిపల్ఎన్నికలు వీరందరినీ ఒక్కటి చేశాయి. శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కంది శ్రీనివాస్ రెడ్డితోపాటు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, మరో వర్గం నేత శ్రీకాంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు.
వర్గాలతో వార్తల్లోకెక్కేవారు కలిసికట్టుగా..
గతంలో రెండు, మూడు వర్గాలుగా విడిపోయి, నిత్యం వార్తల్లోకెక్కిన కాంగ్రెస్లీడర్లు ఇప్పుడు ఒక్కటిగా ముందుకెళ్తున్నారు. టికెట్ల కేటాయింపుపై కొంతమందికి అసంతృప్తి ఉన్నా అందరినీ కలుపుకొని పోవాలని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధిష్టానం ఆదేశించింది. దీంతో పాత, కొత్త నేతలందరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తుండటంతో కొత్త కాంగ్రెస్ ను చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టడం.. గత డిసెంబర్ పర్యటన సందర్భంగా రూ.500 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడం ఆ పార్టీకి కలిసొస్తుందన్న చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ ప్రచార జోరు
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా అన్నిచోట్లా పోటీ చేస్తోంది. ఏఐసీసీ నేతలు సైతం ప్రచారానికి వస్తున్నారు. జిల్లా నాయకులు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.
గత పదేండ్లు చైర్ పర్సన్ పీఠం బీఆర్ఎస్కే దక్కగా.. ఇప్పుడు అధికారంతోపాటు స్థానిక ఎమ్మెల్యే మారడంతో బల్దియా పీఠం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే ఉండటంతో లీడర్లు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
