నిధులు ఎక్కడ్నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తరు? : బండి సంజయ్

నిధులు ఎక్కడ్నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తరు? : బండి సంజయ్
  •     బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుంటే ఏం లాభం?
  •     బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి  చేస్తా: బండి సంజయ్ 
  •     కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం

కరీంనగర్, వెలుగు: బజార్ల అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభమని, నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పులెత్తుకుపోయే దొంగ అని, అందుకే ఆయనను ఎవరూ నమ్మడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌‌‌‌ జిల్లా దుర్శేడ్, గోపాల్‌‌పూర్, సప్తగిరి కాలనీ, ఉస్మానీ అసోసియేట్స్, పాతబజార్, కాపువాడ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, బీజేపీ అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌‌లో బండి సంజయ్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎసోళ్లు 10 ఏండ్లలో చేసిందేమీ లేదు. కబ్జాలు, దోపిడీలు చేసి జైలుకు పోయారు. 

ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతుంటే వేయాలో.. లేదో.. ఆలోచించుకోండి. కేంద్రం నుంచి మేమే నిధులు తెచ్చామని గంగుల కమలాకర్‌‌‌‌, వినోద్ చెప్పుకుంటున్నారు. అసలు మోదీ వాళ్లను గుర్తుపడతారా? పొరపాటున కాంగ్రెస్‌‌కు ఓట్లేసి గెలిపిస్తే ఇంటి పన్నులు, నల్లా, కరెంట్ చార్జీలను పెంచుతరు. అదే బీజేపీకి ఓట్లేస్తే మున్సిపాలిటీల్లో పన్నులు పెంచకుండా కేంద్రం నుంచే నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌‌‌‌ను మరింత అభివృద్ధి చేస్తా”అని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్‌‌‌‌ మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులను తీసుకొచ్చే బాధ్యత తనదేనని సంజయ్ అన్నారు. 

ముస్లింలకు కాదు.. ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకం..

తాను ముస్లింలకు వ్యతిరేకం కానే కాదని, ముస్లింలను వెనుకబాటుకు గురిచేస్తున్న ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకినని బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటిలోనూ ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు. ఎంఐఎం, కాంగ్రెస్ వంటి పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను రెచ్చగొడుతూ వెనుకబాటుకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. పేదరికంలో ఉన్న ముస్లింలకు కచ్చితంగా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ముస్లిం మహిళల బాధలు చూసి ట్రిపుల్ తలాఖ్‌‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన గుర్తుచేశారు.