పద్మారావునగర్, వెలుగు: క్రిస్మస్ సందర్భంగా బేగంపేటలోని కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా ‘పరంపరగా పాక కళ’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించి మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐదు ప్రపంచ రికార్డులు సాధించిన ఈ సంస్థ.. తాతల కాలంలోని సంప్రదాయ వంట విధానాలను యువతరానికి పరిచయం చేసేందుకు ఈ ఈవెంట్ నిర్వహించింది. సోమవారం104 మంది విద్యార్థులు 104 రకాల పురాతన సంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎలాంటి గ్యాస్ స్టవ్ లేకుండా కేవలం కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యి, మట్టి పొయ్యి, ఇసుక, సాల్టు వంటి సహజ వనరులతోనే వంటకాలు సిద్ధం చేశారు.
ఆనాటి కాలంలో ఆయిల్ లేకుండా వంటకాలు చేసిన విధానాన్ని పరిశోధించి అమలు చేశారు. ప్రపంచంలో ఇలాంటి సంప్రదాయ వంటకాల కార్యక్రమం ఎక్కడా నిర్వహించలేదని అకాడమీ చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. భవిష్యత్ తరాలకు సంప్రదాయ పాకకళ అందించే లక్ష్యంతో ఈ ప్రయత్నం చేశామన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల చెఫ్ మాస్టర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు.
