హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్, కొత్త వార్డుల ఏర్పాటు ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లల్లో జోక్యం చేసుకునేందుకు, ఉత్తర్వులను జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. వార్డుల జనాభా, మ్యాప్‌ల వివరాలను 24 గంటల్లోగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి గతంలో ఆదేశించారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు రెండ్రోజుల గడువిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేసింది. ఈ ఉత్తర్వులు కోర్టును ఆశ్రయించిన రెండు డివిజన్లకు చెందిన ఇద్దరు పిటిషనర్లకు మాత్రమే పరిమితం చేసింది.
ఈ నేపథ్యంలో వార్డుల డీలిమిటేషన్, కొత్త వార్డుల ఏర్పాటు ప్రక్రియపై అత్యవసరంగా విచారణ చేయాలంటూ సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్లు 80 వరకు దాఖలయ్యాయి. వీటిని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారించారు. ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యానికి పరిమితులు ఉన్నట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్‌జీ నిర్దేశిస్తోందని అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదించారు. రిట్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇప్పటికే 5 వేలకుపైగా అభ్యంతరాలు అందాయని, వాటిని పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం వారంలోగా అభ్యంతరాలు చెపాల్సి ఉండగా.. చెప్పకుండా కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం చెల్లదన్నారు. వాదనలపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ, వారంలోగా సమర్పించిన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నందున తమ ముందున్న పిటిషన్లల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.
