నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం షార్ట్ సర్క్యూట్ తో మూడు ఇండ్లతో పాటు, రెండు పశువుల కొట్టాలు కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి ఇండ్లలోని నిత్యవసర సరుకులు, నగదు, ధాన్యం, విలువైన సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో జాదవ్ ప్రేమ్ సింగ్, జాదవ్ సుందర్, జాదవ్ అంబర్ సింగ్ ఇండ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
అదేవిధంగా జాదవ్ రెడ్డియా, రాథోడ్ బిక్కులాల్ కు చెందిన పశువుల కొట్టాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధిత కుటుంబాలను పరామర్శించి జాదవ్ ప్రేమ్ సింగ్ కుటుంబానికి రూ.30వేలు ఆర్థిక సాయం చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి గజేందర్ నష్టపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తిర్మన్పల్లిలో..
సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని తిర్మన్పల్లిలో సున్నపు రాజు లలిత ఇంటికి మంటలు అంటుకుని పూర్తిగా దగ్దం అయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఫైర్సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పారు. ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు, బంగారం, డబ్బులు, బియ్యం కాలి బుడిదైనట్లు తెలిపారు. ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.
