గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు: పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులు విడుదల అయ్యాయని, ఈనెల31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత నెలన్నర కాలంలో గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయని, జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి రూ. 5 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు అందుతాయన్నారు.

99 రోజుల పాటు సాగే ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌‌ ‌‌ ‌‌ ‌‌ లో భారీగా వడ్లు పండాయని, రైతులకు రూ. 20 వేల కోట్ల చెల్లింపులతో పాటు రూ. 40 వేల కోట్ల బోనస్ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 47,750 రేషన్ కార్డులు మంజూరు చేశామని, అర్హులైన వారు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తికి గోదావరి జలాలను తెచ్చే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగాపూర్తి చేయాలి

హుజూర్ నగర్  : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న 2,160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధ్వర్యంలో తొలి విడత లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తూ ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకోవాలని చెప్పారు. కాలనీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు.