శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఎయిర్పోర్టు నుంచి నెదర్లాండ్స్ వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం మెయిల్ రావడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. సంబంధిత విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా, ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎయిర్ పోర్ట్కు 20కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని సమాచారం. వరుస బెదిరింపులతో ఎయిర్పోర్టు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ పంపిన నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
