మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల వేళ నిపుణులు ఊహించినదే జరిగింది. ప్రపంచ చమురు మార్కెట్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారతీయ రిఫైనరీలకు అమెరికా ట్రెజరీ శాఖ 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే యుద్ధం వేళ అమెరికా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది, దానికి గల కారణాలు ఏంటనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సరఫరా అంతరాయాలకు బ్రేక్:
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ ముప్పును నివారించడానికి.. సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురు కార్గోలను కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతి లభించింది. ఇది కేవలం ఒక తాత్కాలిక ఏర్పాటని అమెరికా స్పష్టం చేసింది.
భారత ఇంధన భద్రత:
భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 40% మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా వచ్చే సప్లై నిలిచిపోతే భారత్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు భారత్‌కు ఒక రక్షణ కవచంలా మారబోతోంది. యుద్ధం స్టార్ట్ కాగానే రష్యా సైతం తన మిత్రుడైన ఇండియాకు కావాలంటే క్రూడ్ సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తగ్గిన డిస్కౌంట్ - పెరిగిన ధర:
గతంలో రష్యా చమురుపై బ్యారెల్‌కు దాదాపు13 డాలర్ల వరకు తగ్గింపు లభించేది. కానీ ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల వల్ల.. మార్చి-ఏప్రిల్ నాటికి వచ్చే సరఫరాలపై బ్యారెల్‌కు 4 డాలర్ల నుంచి 5 డాలర్ల ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ధర కంటే కూడా క్రూడ్ ఆయిల్ లభ్యతకే భారత రిఫైనరీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. నిరంతరం సరఫరా ఉండేలా జాప్యం లేకుండా చూసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
అమెరికా వ్యూహం:
రష్యా యుద్ధానికి అవసరమైన ఆదాయం అందకూడదనేది అమెరికా లక్ష్యం. అందుకే ఈ మినహాయింపు కేవలం ఇప్పటికే సముద్రంలో ఉన్న క్రూడ్ ఆయిల్ కి మాత్రమే వర్తిస్తుందని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్ తన చమురు దిగుమతుల కోసం అమెరికాపై ఆధారపడాలని వాషింగ్టన్ భావిస్తున్న సంగతి తెలిసిందే.
యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్ కూడా రష్యా నుంచి తక్షణ సరఫరాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల కొనుగోలుకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం.
