భూకేటాయింపులో జాప్యాన్ని నిరసిస్తూ వంటావార్పు

భూకేటాయింపులో జాప్యాన్ని నిరసిస్తూ వంటావార్పు
  •     10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఫారెస్ట్​ ఆఫీసర్ల హామీ


కడెం,వెలుగు: వ్యవసాయ భూములు కేటాయించడంలో అటవీ శాఖ అధికారులు జాప్యం చేస్తున్నారని నిర్మల్  జిల్లా కడెం మండలం మైసంపేట్  గ్రామస్తులు వంటావార్పుతో నిరసన తెలిపారు. మైసంపేట్  పునరావాస గ్రామానికి కేటాయించిన భూముల్లో రెండు రోజుల కింద గ్రామస్తులు హోలీ సందర్భంగా పూజలు చేస్తుండగా, ఆ భూములు తమవేనని నచ్చన్  ఎల్లాపూర్  గోండుగూడ గిరిజనులు ఆందోళనకు దిగారు. 

అక్కడికి చేరుకున్న మైసంపేట గిరిజనులతో నచ్చన్  ఎల్లాపూర్  గోండుగూడ గిరిజనులు వాగ్వాదానికి దిగారు. మైసంపేట్​ గ్రామస్తులు మాట్లాడుతూ తాము పునరావాస గ్రామానికి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా.. తమకు వ్యవసాయ భూములు పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశమయ్యారు. 10 రోజుల్లో భూముల పంపిణీ పూర్తి చేస్తామని నిర్మల్  డీఎఫ్ వో సుశాంత్  సుఖ్​దేవ్  బోబడే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, లేనిపక్షంలో పాత మైసంపేటకు వెళ్లి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఎఫ్​డీవో శివకుమార్, ఎఫ్ఆర్వో గీతారాణి, సీఐ అజయ్, ఎస్సై సాయికిరణ్  పాల్గొన్నారు.