నాగర్ కర్నూలు జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్

నాగర్ కర్నూలు జిల్లాలో దొంగల ముఠా అరెస్ట్

కల్వకుర్తి, వెలుగు : నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను కల్వకుర్తి, వెల్దండ, వంగూరు పోలీసులు కలిసి గురువారం అరెస్ట్ చేశారు.  కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన కొలుకులపల్లి నాగేశ్, పుట్ట వెంకటయ్య, కుంచపు సైదులు, వెల్దండ మండలం గుండాల గ్రామానికి చెందిన పెరుమాళ్ల రామస్వామి, దొడ్డి యాదయ్య, ఎనుముల జంగయ్య కలిసి ఒక ముఠాగా ఏర్పడి, ఎరుపు రంగు మారుతి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్సో కారులో తిరుగుతూ రెక్కీ నిర్వహించేవారు.

వీరు వంగూరు, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాల్లోని పలు ఇండ్లలో బీరువాలు పగలగొట్టి సుమారు 14 తులాల బంగారం, 10 లక్షలకు పైగా నగదును అపహరించారు. శ్రీశైలం క్రాస్ రోడ్డు సమీపంలోని ఒక దాబా వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా వారి భాగోతం బయటపడింది. వారి నుంచి నుంచి రూ. 6 లక్షల నగదు, కారు, 6 మొబైల్ ఫోన్లు, దొంగతనానికి వాడే ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.