రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి ..నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో కారు పల్టీ

రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి ..నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో కారు పల్టీ
  • భార్యాభర్తలు మృతి
  • భూపాలపల్లిలో బైక్‌‌‌‌, కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

నిజామాబాద్, వెలుగు : కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో భార్యభర్తలు చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నిజామాబాద్‌‌‌‌ నగర శివారులోని బైపాస్‌‌‌‌ రోడ్‌‌‌‌ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన చింతల శ్రీనివాస్‌‌‌‌ స్థానికంగా ఇటుక బట్టీ నడుపుతుండగా.. మహారాష్ట్రలోని నాందేడ్‌‌‌‌ జిల్లాకు చెందిన వ్యక్తులు కూలీలుగా పనిచేస్తున్నారు.

బట్టీలో పనిచేసే యువతీయువకుడు రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారి జాడ కొనుగొనేందుకు బట్టి యజమాని శ్రీనివాస్‌‌‌‌ తన కారులో ఎనిమిది మంది లేబర్లను వెంటబెట్టుకొని బుధవారం రాత్రి నాందేడ్‌‌‌‌ వెళ్లారు. అక్కడ యువతీయువకుడు కనిపించకపోవడంతో తిరిగి దోమకొండ వస్తున్నారు.

ఈ క్రమంలో నిజామాబాద్‌‌‌‌ శివారులోకి రాగానే కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో సత్వా తుకారాం వాగ్మారే (44), అతని భార్య శోభ (42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోగా.. చింతల శ్రీనివాస్, బాలాజీ, శాత్వ, వాగ్మారే తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని స్థానిక జీజీహెచ్‌‌‌‌కు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సీపీ సాయిచైతన్య ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆసిఫ్‌‌‌‌ తెలిపారు.

భూపాలపల్లి జిల్లాలో...

రేగొండ, వెలుగు : బైక్‌‌‌‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్‌‌‌‌ హైవేపై గురువారం జరిగింది. రేగొండ ఎస్సై రాజేశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మహదేవపూర్‌‌‌‌ మండలం బొమ్మాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి శ్రీమాన్‌‌‌‌రెడ్డి (22), కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అన్వేష్ రెడ్డి (22) బైక్‌‌‌‌పై హనుమకొండ నుంచి భూపాలపల్లి వైపు వస్తున్నారు.

ఈ క్రమంలో నారాయణపూర్‌‌‌‌ వద్దకు రాగానే కాళేశ్వరం నుంచి పరకాలకు వెళ్తున్న బైక్‌‌‌‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీమాన్‌‌‌‌రెడ్డి, అన్వేష్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.