క్యూలైన్లకు చెక్.. ఇంట్లో నుంచే ఎరువుల బుకింగ్

క్యూలైన్లకు చెక్.. ఇంట్లో నుంచే ఎరువుల బుకింగ్
  •     యాప్​ డౌన్​లోడ్​, బుకింగ్​పై అవగాహన

కామారెడ్డి​, వెలుగు: ఎరువుల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడకుండా.. సులభంగా, పారదర్శకంగా అవసరమైన ఎరువులు అందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్​ తీసుకొచ్చింది. రైతులు ఇంటి దగ్గరే ఉండే ఆయా సీజన్లకు అవసరమైన ఎరువులను యాప్​లో బుకింగ్​ చేసుకొని సులభంగా పొందవచ్చు. కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి ఈ యాప్​ పని చేస్తుంది.

 స్మార్ట్​ ఫోన్లలో యాప్​ ను ఎలా డౌన్​ లోడ్​ చేసుకోవాలి, ఎలా బుకింగ్ చేయాలి అన్న అంశాలపై రైతులకు కేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. రైతు వేదికలు, పంచాయతీ భవనాలు, సొసైటీలు, గ్రామ కూడళ్లలో సమావేశాలు పెట్టి .. యాప్​ గురించి సులభంగా అర్ధమయ్యేలా వివరిస్తున్నారు.

 జిల్లాలో 5 లక్షల 25వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2 లక్షల వరకు రైతులు ఉన్నారు. ప్రధానంగా వరి, మక్క, సోయా, పత్తి, చెరకు, కంది,పెసర, మినప పంటలు సాగు చేస్తుంటారు. ఈ పంటల సాగుకు విరివిగా ఎరువులు అవసరమవుతాయి. ప్రధానంగా యూరియా వినియోగంఎక్కువ. డిమాండ్​ ఎక్కువగా ఉండడంతో సొసైటీలు, డీలర్ల వద్ద రైతులు ఎరువుల కోసం క్యూ కట్టవలసివస్తోంది. ఖరీఫ్​ సీజన్​లో రైతులు గంటల తరబడి లైన్లలో నిల్చోవలసివచ్చింది. 

కొన్ని చోట్ల లైన్లలో చెప్పులు, రాళ్లు పెట్టి ఎదురుచూసినా కొందరికి యూరియా దొరకలేదన్న ప్రచారం జరిగింది. రైతులు ఒక్కసారిగా సొసైటీలు, షాపుల ద్గరకు రావడం, కొరత రానుందన్న ప్రచారంతో అవసరానికి మించి యూరియి బస్తాలు కొని దాచుకోవాలని ఆశించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో ఈ సమస్యకు చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం ఎరువుల బుకింగ్​ యాప్​ తీసుకొచ్చింది. దీని వల్ల రైతులకు అవసరాలకు తగినంత యూరియా అందనుంది. యూరియా పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదు. 

సులభంగా బుకింగ్

రైతులు తమ స్మార్ట్ ఫోన్లలో ప్లే స్టోర్​లో నుంచి ఫర్టిలైజర్ బుకింగ్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకొవాలి. ఒక వేళ వారి వద్ద స్మార్ట్ ఫోన్​ లేకపోతే తెలిసిన వారి ఫోన్లో యాప్​ డౌన్​లోడ్​ చేసుకొని కూడా ఎరువులను బుకింగ్ చేసుకొవచ్చు. ఇందులో రైతులు, డీలర్లు, అధికారులకు వేర్వేరు లాగిన్లు ఉంటాయి. రైతులు తమ పట్టాదారు పాసుబుక్ నంబర్​, భూమి వివరాలు, పంటల సాగు వివరాలు ఎంట్రీ చేసుకోవాలి. ఆ తర్వాత తమకు అవసరమైన యూరియా బుకింగ్​ చేసుకొవచ్చు. భూ విస్తీర్ణం బట్టి రైతులకు యూరియా కేటాయింపు ఉంటుంది. బుక్​ చేసుకున్న 24 గంటల్లోగా రైతులు ఎరువులను తీసుకోవాలి. 

 రైతులకు అవగాహన

యాప్ డౌన్​లోడ్, బుకింగ్​పై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఏవోలు, ఏఈవోలు గ్రామాల్లో పోగ్రాంలు నిర్వహించి వివరిస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలోని గ్రామాల్లో వారం రోజుల పాటు అవేర్ నెస్​ పోగ్రాంలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. యాప్​పై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ సూచించారు.