వికారాబాద్‌‌ లో దుండ్‌‌..  నిజామాబాద్‌‌ లో పిడిగుద్దులాట..హోలి సందర్భంగా వింత ఆటలు ఆడిన గ్రామస్తులు

వికారాబాద్‌‌ లో దుండ్‌‌..  నిజామాబాద్‌‌ లో పిడిగుద్దులాట..హోలి సందర్భంగా వింత ఆటలు ఆడిన గ్రామస్తులు
  •     హున్సాలో పిడిగుద్దులాటలో పాల్గొన్న గ్రామస్తులు
  •     వికారాబాద్‌‌ జిల్లాలో పెండ్లి కాని యువకులను కట్టెలతో కొట్టిన మహిళలు

బోధన్, వెలుగు : హోలి పండుగ సందర్భంగా నిజామాబాద్‌‌ జిల్లా సాలూర మండలంలోని హున్సాలో గ్రామంలో బుధవారం పిడిగుద్దులాట రసవత్తరంగా సాగింది. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి స్థానిక హనుమాన్‌‌ మందిరం సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు చేరుకున్నారు. ముందుగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామపెద్దలను కులాలవారీగా బాజభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ ఆట స్థలం వద్దకు తీసుకొచ్చారు. తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు రెండు వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పిడిగుద్దులాట సందర్భంగా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భోదన్‌‌ రూరల్‌‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, హోలి సందర్భంగా వందేండ్ల నుంచి పిడిగుద్దులాట నిర్వహిస్తున్నామని, ఈ ఆట జరుపకపోతే గ్రామానికే అరిష్టమని పలువురు తెలిపారు. ఆట నిర్వహిస్తే పాడిపంటలు పుష్కలంగా పండుతాయని, గ్రామస్తులు సుఖసంతోషాలతో జీవిస్తారని చెప్పారు. 

వికారాబాద్‌‌ జిల్లాలో...

కొడంగల్ : హోలి సందర్భంగా వికారాబాద్‌‌ జిల్లా  బోట్లోనితండా, దేవులనాయక్‌‌ తండావాసులు ‘దుండ్‌‌’ అనే సంప్రదాయ ఆటను నిర్వహించారు. ఇందులో భాగంగా తండాలోని ప్రతి ఇంటి ముందు పాయసం వండిన ఓ కుండను పెట్టి, దానిని ఎత్తుకుపోకుండా తాళ్లతో కట్టి మహిళలు కాపలాగా ఉంటారు. పెళ్లీడుకొచ్చిన యువకులు పాయసం కుండలను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే.. మహిళలు కట్టెలతో దాడి చేయడమే ఈ ఆట ప్రత్యేకత. పాయసం తిన్న తర్వాత రంగులు చల్లుకుంటూ సంబురాలు  జరుపుకున్నారు.