పరిగి, వెలుగు: కల్యాణలక్ష్మి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి లంచం తీసుకుంటూ వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ జీపీవో జగదీశ్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మోత్కూర్ గ్రామానికి చెందిన ఎడ్ల ఎల్లమ్మ తన కుమార్తె వివాహం అనంతరం కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి జీపీవో జగదీశ్ రూ.6 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితురాలు అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో కనీసం రూ.2 వేలైనా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఎల్లమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం దోమ తహసీల్దార్ కార్యాలయంలో రూ.2 వేల లంచం ఇస్తుండగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ రేంజ్ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలోని అధికారులు జగదీశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
