పరిగిలో నకిలీ డీఏపీ కలకలం...వేల బస్తాలు కొనుగోలు చేసిన వందల మంది రైతులు

పరిగిలో నకిలీ డీఏపీ కలకలం...వేల బస్తాలు కొనుగోలు చేసిన వందల మంది రైతులు
  •     పొలాల్లో ఎరువు వేస్తుండగా రైతుల చేతులకు మంటలు, బొబ్బలు 

పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ డీఏపీ కలకలం రేగింది. పరిగి మండలంలోని లఖ్నాపూర్, చిగూరాల్‌‌పల్లి, బసిరెడ్డిపల్లి, పూడూరు మండలంలోని మంచన్‌‌పల్లి గ్రామాల్లో వందల మంది రైతులు వేల నకిలీ డీఏపీ బస్తాలను కొనుగోలు చేశారు. కంపెనీల మార్కెటింగ్ సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి రూ.1,700 ఒక బస్తా డీఏపీ ఇంటి వద్దకే ఇస్తామని చెప్పడంతో పలువురు రైతులు వాటిని కొనుగోలు చేశారు. నకిలీ డీఏపీ అమ్మడానికి కంపెనీ ప్రతినిధులు ఆయా గ్రామాల్లోని ఉత్తమ రైతులు, సర్పంచ్‌‌లు, బ్రోకర్లను ఎంపిక చేసుకొని వారికి కమీషన్ ఇచ్చి.. రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ డీఏపీ చౌకగా వస్తుందని, మార్కెట్‌‌లో సరఫరా తక్కువగా ఉందని చెప్పి రైతులతో కోనుగోలు చేయించారు. రైతులు పంట పొలాలకు డీఏపీని వేస్తుండగా చేతులకు మంటలు రావడం, బొబ్బలెక్కడంతో అనుమానం వచ్చింది. 

పూడూరు మండలం మంచన్‌‌పల్లిలో ఒక రైతు సుమరుగా 70 బస్తాలు కొనుగోలు చేశానని చెప్పారు. పంట పొలానికి డీఏపీ వేసి మూడు నాలుగు రోజులైన కరగకపోవడం, పొలంలో వారం రోజులైన గ్రోత్ రాకపోవడంతో విషయం బయటికి వచ్చింది. క్షుణ్నంగా పరిశీలించగా నకిలీ డీఏపీ బ్యాగ్‌‌పై లోగో (బ్యాగ్‌‌పై మొక్క బొమ్మ) సరిగ్గా లేకపోవడాన్ని రైతులు గమనించారు. చిగూరాల్‌‌పల్లి క్లస్టర్‌‌‌‌లో 134 బస్తాలు నకిలీ డీఏపీ లభ్యమైందని, అలాగే మంచన్‌‌పల్లిలో ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని పరిగి వ్యవసాయ అధికారిణి రజిత తెలిపారు. గత వారం రోజులుగా పరిగిలో నకిలీ డీఏపీ అమ్మకాలు కొనుగోలు జరుగుతున్న ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు అడ్డుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.