అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి మహిళ మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి మహిళ మృతి
  • భర్తను కారులో డ్రాప్ చేసి వస్తుండగా ఘటన 

ఆమనగల్లు/చేవెళ్ల, వెలుగు: అమెరికాలోని న్యూజెర్సీలో జరిగినరోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపతి దీపారెడ్డి(44) మృతి చెందింది. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్‌‌రెడ్డి, శశిరేఖ దంపతుల బిడ్డ అయిన దీపారెడ్డికి 20 ఏండ్ల కింద ఆకుతోటపల్లికి చెందిన శ్రీపతి 
రామకృష్ణారెడ్డితో వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్లుగా అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.

 2008 నుంచి అక్కడే ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి రోజూ న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వెళ్లి పని చేస్తుంటాడు. సోమవారం రామకృష్ణను.. దీపారెడ్డి కారులో మెట్రో వద్ద డ్రాప్​చేసి తిరిగి వస్తుండగా ఓ సిగ్నల్​వద్ద ఆగింది. సిగ్నల్​పడగానే కొంచెం ముందుకు కదలగా.. వేరే వైపు నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీపారెడ్డికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతురాలికి  ఇద్దరు బిడ్డలు సంస్కృత, హర్షిత ఉన్నారు.  దీపారెడ్డి డెడ్‌‌బాడీని తొందరగా తీసుకురావడానికి అమెరికాలోని స్థానిక తెలుగు సంఘాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.