- రెండో టీ20 మ్యాచ్ రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
విశాఖపట్నం: తొలి టీ20లో జోరు చూపెట్టిన ఇండియా విమెన్స్ జట్టు.. శ్రీలంకతో రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియాకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. బౌలర్లు లంకను 121/6 స్కోరుకే పరిమితం చేయగా, బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ అద్భుతంగా ఆడి గెలిపించారు. అయితే మ్యాచ్ మధ్యలో ఫీల్డింగ్, క్యాచింగ్‌లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దాంతో ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఈ రెండు అంశాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఇండియాకు ఆరు వారాల విరామం లభించింది.
ఆ తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వారం రోజుల క్యాంప్‌లో ఫీల్డింగ్‌పై కసరత్తులు కూడా చేసింది. అయినా ఫీల్డింగ్ ఆశించిన మేర లేదు. ఇక బ్యాటింగ్‌లో జెమీమా మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. రెండు చేతులతో బౌలింగ్ చేసే శషిని గిమ్హాని బౌలింగ్‌లో అర డజను బౌండ్రీలు రాబట్టడం జెమీమాను ప్రత్యేకంగా నిలిపింది. ఓపెనింగ్‌లో షెఫాలీ వర్మ గాడిలో పడాలి. ఈ ఫార్మాట్‌లో ఆమె మరింత నిరూపించుకోవాల్సి ఉంది. రిచా ఘోష్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. ఓవరాల్‌గా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే ఈ పోరులో కొనసాగించే చాన్సుంది. బౌలింగ్‌లో 20 ఏండ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మపై ఎక్కువగా అంచనాలున్నాయి. తొలి మ్యాచ్‌లో వికెట్ తీయకపోయినా 16 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఇందులో ఒక్క బౌండ్రీ కూడా లేకపోవడం విశేషం. అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, శ్రీచరణి అండగా నిలవాలి. మరోవైపు లంక కూడా ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ బ్యాటింగ్ వైఫల్యాన్ని ఇందులో సరిదిద్దుకోవాలని యోచిస్తోంది. ఇది జరగాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ తలా కొన్ని రన్స్ చేయాలి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గెలిచి లెక్క సరిచేయాలని లంక టార్గెట్‌గా పెట్టుకుంది.
