- కాకా 11వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి మంత్రి వివేక్ దంపతుల నివాళి
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాకా విగ్రహం వద్ద మంత్రి వివేక్, సరోజ దంపతులు పూల మాలవేసి, నివాళులర్పించారు. అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కార్మిక రంగంలో కాకా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్నారు. ఇండియా క్రికెట్‌కు కూడా కాకా ఆదరణ కల్పించారని చెప్పారు.
తమ కుటుంబ సభ్యులకు అండగా ఉన్న సోనియా, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు కాకా అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంతకుముందు కాకా విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పూలమాల వేసి నివాళి అర్పించారు.
గాంధీ భవన్‌లో కాకాకు మంత్రుల నివాళి..
కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఆయన చిత్ర పటానికి పలువురు మంత్రులు, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు పీసీసీ నేతలు, పలువురు పార్టీ కార్యకర్తలు కాకా చిత్ర పటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం కేంద్ర మంత్రిగా కాకా ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా తెలంగాణ కోసం చేసిన కృషిని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన పోరాట పాత్రను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
