- ఆర్ కృష్ణయ్య ఆరోపణ
బషీర్‌బాగ్, వెలుగు: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాష్ట్రంలో ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిళ్ల సతీశ్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడ రెడ్డి కాలేజీ నుంచి వైఎంసీఏ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు బకాయిలతో విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఆందోళనలు, ధర్నాలు, బంద్‌లు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తక్షణమే 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శివ కుమార్ యాదవ్, నరేశ్ గౌడ్, జిల్లపల్లి అంజి పాల్గొన్నారు.
