కేసీఆర్ స్టేట్స్మన్గా మాట్లాడితే.. రేవంత్ చీప్గా మాట్లాడిండు: హరీశ్ రావు

కేసీఆర్ స్టేట్స్మన్గా మాట్లాడితే.. రేవంత్ చీప్గా మాట్లాడిండు: హరీశ్ రావు
  • నిధులు తేవడంలోమీ అనుభవం ఏమైంది?: హరీశ్
  • వాటాలు పంచుకోవడంలోనే ఎక్స్​పీరియన్స్ ఉన్నదా?
  • ఫార్మా సిటీ విలువేంటో కేసీఆర్ చెప్పారు
  • కాళేశ్వరం కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పకుండా.. సీఎం రేవంత్ రెడ్డి మరుగుజ్జు మనస్తత్వంతో వ్యవహరించారని మాజీ మంత్రి హరీశ్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం సహా అన్ని అంశాలపై కేసీఆర్ స్టేట్స్​మెన్​లా మాట్లాడితే.. రేవంత్ మాత్రం స్ట్రీట్ రౌడీలాగా చీప్​గా మాట్లాడారని మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలికారన్నారు. తెలంగాణ భవన్​లో సోమవారం హరీశ్   మీడియాతో మాట్లాడారు. ‘‘నిధులు తేవడంలో అను భవం ఉందని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇప్పుడేమైంది? వాటాలు, లూటీలు, దోపిడీలకు మాత్రమే ఆ అనుభ వం సరిపోయిందా? ఫార్మాసిటీ విలువేంటో కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని అంటున్నరు. మరి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు.. కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన గ్లోబల్ సమిట్​లో తెలంగాణ ప్రగతి గురించి ఏం చెప్పారో వినలేదా? కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అభివృద్ధి సాధించిందని వాళ్లు చెప్పారు’’అని హరీశ్ అన్నారు. కాళేశ్వరం కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి కింద కాళేశ్వరం నీళ్లతో పంటలు పండలేదా? అని ఆయన ప్రశ్నించారు. 

సగం సగం చదివి.. సగం సగం చెప్తున్నరు

మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండేండ్లవుతున్నా ప్రెస్​మీట్లకు ఎలా ప్రిపేర్ అయ్యి రావాలో తెలవడం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ‘‘సగం సగం చదివి.. సగం సగం చెప్తుంటరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ 2023లో వాపస్ వస్తే.. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతి, సెంట్రల్ సాయిల్, మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతులు ఎలా వచ్చాయి? 2023, ఏప్రిల్ 12న డీపీఆర్ వాపస్ వస్తే.. 3 రోజుల్లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. జలశక్తి శాఖ అధికారులతో కేసీఆర్ మాట్లాడారు. ఈఏసీ సిఫార్సుతో 7 అనుమతులు సాధించినం. కానీ, 2024, డిసెంబర్ 19న కేంద్రం డీపీఆర్​ను వెనక్కు పంపితే కాంగ్రెస్ సర్కారు ఎందుకు మౌనంగా ఉన్నది? అది చాలదన్నట్టు 45 టీఎంసీలు చాలంటూ ఢిల్లీకి ఉత్తమ్ లేఖ రాశారు. ఈ 45 టీఎంసీలతో ఎవరికి అన్యాయం చేస్తారు? పాలమూరు జిల్లాకా.. రంగారెడ్డికా.. నల్గొండ జిల్లాకు నష్టం చేస్తరా?’’అని హరీశ్ మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్​లోనే ఇలాంటి పనులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్​, ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదు. మీరు చేసింది చెక్ డ్యాంల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప ఏముంది?’’అని హరీశ్ విమర్శించారు.