- ఉమ్మడి వరంగల్లో 1683 జీపీలు 1653 జీపీలో ప్రమాణ స్వీకారం
- ములుగు జిల్లా 28 జీపీల్లో ''నో ఎలక్షన్.. నో ప్రమాణం''.,
- మరో రెండు గ్రామాల్లో అభ్యర్థుల ఇతర పర్యటనలో కారణం
- మరో రెండు గ్రామాల్లో అభ్యర్థులు వైజాగ్ మీటింగ్ కారణంగా
- చెదురుమదురు ఘటనలు మినహా ప్రమాణం ప్రశాంతం
వరంగల్, వెలుగు: ఓరుగల్లులో సోమవారం కొత్త సర్పంచులు కొలువుదీరారు. వరంగల్ ఉమ్మడి ఆరు జిల్లాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించిన 1,653 గ్రామపంచాయతీల్లో పండుగ వాతావరణం కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు రెండురోజుల ముందునుంచే గ్రామస్తులు, పార్టీ పెద్దలు, బంధుమిత్రులకు ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.
సోమవారం ఉదయమే సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లను ముఖ్య అతిథులుగా పిలుచుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం దామరవంచలో ప్రమాణ స్వీకారం విషయంలో ''నేనే సర్పంచ్ అంటే నేనే'' అంటూ ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు మహిళలు పోటీపడటం, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో కాంగ్రెస్, బీఆర్‍ఎస్ శ్రేణుల మధ్య చిన్నపాటి ఘర్షణ మినహా ఓరుగల్లులో సర్పంచుల ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముసిగింది.
ప్రమాణస్వీకారంలో ప్రముఖులు..
జనగామ అర్బన్/ రఘునాథపల్లి/ జయశంకర్భూపాలపల్లి/ హసన్‌పర్తి/ వర్ధన్నపేట (ఐనవోలు)/ పర్వతగిరి/ నల్లబెల్లి : జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల, బండ్ల గూడెం, రఘునాథపల్లి మండలం కంచనపల్లి, స్టేషన్ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామాల్లో ఆయా గ్రామాల పాలకవర్గాల ప్రమాణ స్వీకారం కార్యక్రమాలకు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
భూపాలపల్లి నియోజవర్గంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి మండలాల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచ్ల ప్రమాణ స్వీకారంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని పలు గ్రామాల్లో సర్పంచ్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమాలకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వారిని సన్మానించారు. కాగా, పలుచోట్ల అధికారులు కొత్త సర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
25 జీపీలు కోర్టు కేసులో 3 మున్సిపాలిటీలో..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1683 గ్రామపంచాయతీలు ఉండగా, 28 జీపీలో ఎలక్షన్లు నిర్వహించలేదు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ అంశం సుప్రీంకోర్టులో ఉన్ననేపథ్యంలో ఇక్కడ ఎలక్షన్లు నిర్వహించలేదు.
అలాగే ములుగు జిల్లాలోనే మున్సిపాలిటీలుగా మారనున్న ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లెలోనూ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించలేదు. ములుగు జిల్లాలో రెండు గ్రామాల సర్పంచ్‌లు ఐటీడీఏ పెసా మీటింగ్ లో భాగంగా వైజాగ్ పర్యటనలో ఉండడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు.
