- యూపీలోని చందౌసీలో మరో ‘బ్లూ డ్రమ్’ దారుణం
- కుమార్తె చెప్పిన వివరాలతో నిందితుల అరెస్టు
- శరీర భాగాలు, ఆధారాలు సేకరించిన పోలీసులు
లక్నో: దేశంలో సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్’ మర్డర్ లాంటి ఘోరం ఉత్తరప్రదేశ్‌లోనే మరోకటి చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగుల్లో మూటకట్టి బ్లూ డ్రమ్ములో వేసింది. సంభల్ జిల్లా చందౌసీలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాహుల్(40) అనే వ్యక్తి షూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతనికి 15 ఏండ్ల కింద రూబీ అనే మహిళతో వివాహం అయింది. వారికి 12 ఏండ్ల కొడుకు. 10 ఏండ్ల కూతురు ఉంది. రూబీ కొన్నాళ్లుగా గౌరవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూబీ నవంబర్18న తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కానీ ఆమె మాటలు, వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆ దిశలో దర్యాప్తు జరుగుతుండగా.. . డిసెంబర్ 15న పట్రౌవా రోడ్డులో ఈద్గా దగ్గర పాలిథీన్ బ్యాగుల్లో మానవ శరీర భాగాలు దొరికాయి.
చేతులు, కాళ్లు, మొండెం ఇలా వేరువేరుగా ఉన్నాయి. దొరికిన చేతిపై ‘రాహుల్’ అని పచ్చబొట్టు ఉండటంతో అవి కనిపించకుండా పోయిన రాహుల్శరీర భాగాలుగా గుర్తించారు. ఆ తర్వాత రాహుల్ పదేండ్ల కుమార్తె పోలీసులతో మాట్లాడుతూ తరచూ ముగ్గురు వ్యక్తులు తమ ఇంటికి వచ్చే వారని చెప్పింది. వారు తమకు చాక్లెట్టు తెచ్చేవారని తెలిపింది.
తమ నాన్నను చంపిన వారిని ఊరి తీయాలి అని కన్నీళ్లతో వేడుకుంది. దీంతో పోలీసులు రూబీ, గౌరవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌ను ఇంట్లో హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇంట్లో నుంచి కాట్ లెగ్, స్కూటర్, బ్యాగ్, టాయిలెట్ బ్రష్, ఐరన్ రాడ్, ఎలక్ట్రిక్ హీటర్ లాంటి ఆధారాలు సేకరించారు. మరి కొన్ని శరీర భాగాలు వేర్వేరు చోట్ల పడేశారు. తల ఇంకా దొరకలేదు. దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
