- పాత బల్దియా, విలీన ప్రాంతాల్లోనూ అమలు
- ఆస్తి పన్ను వడ్డీలో 90 శాతం రాయితీ
- మంగళవారం నుంచే అమలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‌తో పాటు విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆస్తిపన్ను బకాయిదారులకు భారీ ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్స్కీమ్’ (ఓటీఎస్)ను తీసుకువచ్చింది. ఓటీఎస్ పై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం బల్దియా లెటర్రాయగా, అనుమతులు మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులిచ్చారు. మంగళవారం నుంచి ఈ ఓటీఎస్ అమల్లోకి రానంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రైవేట్ ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. బకాయి పడ్డ ఆస్తిపన్ను మొత్తంతో పాటు, దానిపై పేరుకుపోయిన వడ్డీలో కేవలం10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. పాత బల్దియాతో పాటు ఇటీవల విలీనమైన 27 లోకల్ బాడీలకు కూడా ఈ స్కీమ్ వర్తించనుంది.
టార్గెట్ రూ.3 వేల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ ను జీహెచ్ఎంసీ ముందుగా రూ.2,200 కోట్లుగా ఫిక్స్ చేయగా, ఆ తర్వాత రూ. 2,500 కోట్లకు పెంచుకుంది. జీహెచ్ఎంసీలోకి ఇటీవలే 27 లోకల్ బాడీలు విలీనం కావడంతో పరిధి కాస్త 650 కిలోమీటర్ల నుంచి 2,050 కిలోమీటర్లకు చేరింది. పాత లెక్కలో జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 14 లక్షల ప్రాపర్టీలుండగా, విలీనమైన 27 సర్కిళ్లలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులతో కలిపి సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల వరకు పెరిగింది. కానీ, విలీన 27 సర్కిళ్లలోని ఆస్తుల్లో క్యాపిటల్ వ్యాల్యూ ప్రాతిపదికన వసూలు చేస్తుండగా, బల్దియా పరిధిలో రెంటల్ వ్యాల్యూ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. వసూళ్ల ఏ రకంగా చేసినా, డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాకే చేరతాయి కాబట్టి ఇప్పటి వరకు పెట్టుకున్న టార్గెట్ ను పెంచి రూ. 3 వేల కోట్లు చేశారు. ఇప్పటి వరకు పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రూ.1,478 కోట్ల వసూలు కాగా, టార్గెట్ చేరేందుకు మరో రూ.1,522 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వీటిలో కనీసం రూ. 500 కోట్లు విలీన సర్కిళ్ల నుంచి పాత బల్దియా నుంచి మరో రూ.వెయ్యి కోట్ల మేరకైనా పన్ను వసూలు చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇది నాలుగోసారి..
గ్రేటర్ లో ఇప్పటికే మూడు సార్లు ఓటీఎస్ అమలు చేశారు. మొదటిసారి 2020లో ఓటీఎస్ప్రవేశపెట్టారు. అప్పుడు కరోనా టైంలో బల్దియా ఆదాయం తగ్గడంతో ఓటీఎస్తీసుకువచ్చారు. 2020–21లో ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు ఓటీఎస్ అమలు చేసి రూ.400 కోట్ల ఆదాయం తీసుకువచ్చారు. 2022–23లో రెండోసారి జులైలో ఓటీఎస్‌ద్వారా రూ.170 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరం మార్చిలో రూ.350 కోట్లు వచ్చింది. ఈసారి విలీన ప్రాంతాలతో కలిపి రూ.3 వేల కోట్ల టార్గెట్పెట్టుకున్నారు. కాగా, గ్రేటర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే రూ.5 వేల కోట్లు రావలసి ఉండగా, సాధారణ ప్రజల నుంచి మరో రూ.6 వేల కోట్లు రావాలి. విలీనమైన లోకల్ బాడీల్లో రూ.వెయ్యి కోట్ల బకాయిలున్నాయి. అన్ని చోట్లా బకాయిలు పేరుకుపోతుండడంతో ఓటీఎస్ ద్వారా రాబట్టుకునేందుకు బల్దియా ప్లాన్‌వేసింది.
