డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ..నీళ్ల పై నిలదీద్దాం

డిసెంబర్  29 నుంచి అసెంబ్లీ..నీళ్ల పై నిలదీద్దాం
  • బీఆర్‌‌‌‌ఎస్​ అబద్ధాల కోటలు బద్దలు కొడుదాం 
  • మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్‌‌రెడ్డి
  • ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లేవ్​ 
  • 42 శాతం రిజర్వేషన్ల సాధనపై రోడ్‌‌ మ్యాప్​ సిద్ధం చేద్దాం 
  • భవిష్యత్తులో జీహెచ్​ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందాం
  • పనుల్లో స్పీడ్ పెంచి.. ప్రజామోదం పొందాలని దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు:రెండేండ్ల  పాలనను చూసి ఓర్వలేక కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇక ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. వాళ్ల బండారాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడదామని మంత్రులకు పిలుపునిచ్చారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో మంత్రులతో సీఎం రేవంత్‌‌రెడ్డి  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన గెలుపు , కృష్ణా, గోదావరి బేసిన్‌‌లో నీటి వాటాలు, గత బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన నష్టంపై చర్చించారు. దీంతోపాటు  300 డివిజన్లతో ఏర్పాటైన  మెగా హైదరాబాద్ (జీహెచ్ఎంసీ)ను  భవిష్యత్తులో  రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా మార్చడంపై సీఎం కీలక సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేశారంటూ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.  భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం ప్రదర్శించాలని, పార్టీ కేడర్‌‌‌‌ను సమాయత్తం చేయాలని సూచించారు. కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ  ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే ఉద్దేశం లేదని, దీనిపై త్వరలోనే  చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీని కోసం పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  భవిష్యత్తుపై మంత్రులతో జరిగిన భేటీలో సుదీర్ఘ చర్చ నడిచింది. నగర పరిధిని 300 డివిజన్లకు విస్తరించడంపై వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూనే, పరిపాలన సౌలభ్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రులకు  సీఎం  స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. మెగాసిటీని  రెండు లేదా మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు సీఎం రేవంత్‌‌ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.

పదేండ్ల నష్టంపై పవర్‌‌‌‌ పాయింట్​ ప్రజెంటేషన్‌‌​ 

ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు  నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం, ప్రధానంగా నీళ్ల అంశాన్ని అజెండాగా మార్చుకోనున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కృష్ణా, గోదావరి బేసిన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సభ సాక్షిగా ఎండగట్టాలని మంత్రుల భేటీలో నిర్ణయించారు.  ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయంతోపాటు బీఆర్ఎస్ పాలనలో వివిధ ప్రాజెక్టులపై జరిగిన నిర్లక్ష్యాన్ని సాక్ష్యాధారాలతో వివరించనున్నారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీలోనే ఏపీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను ప్రదర్శించడం ద్వారా వారి డబుల్ స్టాండర్డ్స్ ను బయటపెట్టనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌‌లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల అంశాలు, ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై సభలో స్పష్టం చేయనున్నారు. ఉమ్మడి ఏపీ పాలనలో తెలంగాణ నీటి వాటాకు జరిగిన అన్యాయాన్ని, స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల జరిగిన నష్టాన్ని సవివరంగా  చర్చించనున్నారు. గత రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగంలో వచ్చిన మార్పులు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తీసుకున్న చర్యలను సభలో వివరించాలని నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో గత ప్రభుత్వ వైఖరిని, ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను  వివరించనున్నారు. జలవనరుల వినియోగంలో తెలంగాణ హక్కులను ఎలా కాపాడుతున్నారో గణాంకాలతో సహా నిరూపించేందుకు సిద్ధమయ్యారు. 

సంక్షేమం స్పీడప్‌‌..

బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, ఆధారాలతో సహా ప్రజల ముందు నిజాలను బయటపెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్‌‌రెడ్డి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను, వారు చెబుతున్న అబద్ధాలను సోషల్ మీడియా, ప్రధాన మీడియా వేదికగా ఎండగట్టాలని సూచించారు. గత పదేండ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గణాంకాలతోసహా వివరించడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలిజేయాలన్నారు. ఇప్పటివరకు చేసిన సంక్షేమాన్ని ఇంకా వేగవంతం చేస్తూనే, విమర్శించే వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. ‘‘పాలనలో మనం చేసిన మంచిని పది కాలాలపాటు గుర్తుండేలా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది” అని సీఎం స్పష్టంచేశారు.