- మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన 45 టీఎంసీలకు లెక్కలు చెప్పాలని సీడబ్ల్యూసీ లేఖ
- అప్పట్లో స్పందించని బీఆర్ఎస్ సర్కారు
- 2024 జనవరిలో కేంద్రానికి కాంగ్రెస్ సర్కారు రిప్రెజెంటేషన్
- అనుమతులు, జాతీయ హోదా ఇవ్వాలని సీఎం రేవంత్ లేఖ
- బ్రజేశ్ ట్రిబ్యునల్ కేటాయింపులు తేలలేదని కేంద్రం కొర్రీలు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. ప్రాజెక్టు ప్రారంభంలో మొదలైన చిక్కుముడులు నేటికీ వీడడం లేదు. మొదట్లో భూసేకరణ సమస్య.. ఆ తర్వాత డీపీఆర్ వాపస్.. ఇప్పుడు కొత్తగా నీటి కేటాయింపుల అంశం సమస్యగా మారింది. పాలమూరు అనుమతుల విషయాన్ని మొదటి నుంచీ బీఆర్ఎస్ సర్కారునిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. 2014 లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రభుత్వం, ఏకంగా 8 ఏండ్ల తర్వాత పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్(డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను సీడబ్ల్యూసీకి సమర్పించడమే ఇందుకు కారణమని ఇరిగేషన్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.
నాడు బీఆర్ఎస్సర్కారు ప్రతిపాదించిన 45 టీఎంసీల మైనర్ఇరిగేషన్ మిగులు లెక్కలపై కేంద్ర జలశక్తి శాఖకు క్లారిటీ ఇవ్వకపోవడం, మరో45 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపులే అని చెబుతున్న కేసీఆర్.. అప్పట్లో గట్టిగా వాదించకపోవడంలోని అంతరార్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో కేంద్రం లేఖ రాసినా స్పందించలే..
2014 లో అధికారపగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ సర్కారు.. ఎనిమిదేండ్ల తర్వాత 2022 సెప్టెంబర్ 13న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి సమర్పించింది. ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కోరగా, డీపీఆర్‌లోని కొన్ని వివరాలపై సీడబ్ల్యూసీ స్పష్టత కోరింది. ముఖ్యంగా ప్రాజెక్టు కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు 90.8 టీఎంసీల జలాలను కేటాయించగా.. 45.66 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన జలాలుగా రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. మరో 45 టీఎంసీలను.. గోదావరి డైవర్షన్ ద్వారా ఎగువన వాడుకుంటామని చూపించింది.
కానీ ఈ జలాల అంశం ఇంకా తేలలేదని సీడబ్ల్యూసీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన 45 టీఎంసీలకు పక్కా లెక్కలు లేవని, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల అంశం ట్రిబ్యునల్‌లో పెండింగ్ ఉందని పేర్కొంటూ 2023 ఏప్రిల్ 4న డీపీఆర్‌ను తిప్పి పంపి వివరణ కోరింది. ఆ లేఖకు మౌఖికంగా కేంద్రానికి వివరాలు తెలియజేశారే తప్ప.. పటిష్టమైన ఆధారాలు సమర్పించలేదు. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది.
ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ రాలేదని పేర్కొంటూ నిరుడు (2024) డిసెంబర్లో డీపీఆర్‌ను అప్రైజల్ లిస్టు నుంచే తప్పించింది. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు అయ్యేదాకా గోదావరి డైవర్షన్ ప్రస్తావన తేవొద్దని పేర్కొంది. మైనర్ ఇరిగేషన్ జలాల ఆదాపై ఫార్మాట్ ప్రకారం ఇస్తేనే మళ్లీ అప్రైజల్ లిస్టులో చేరుస్తామని తేల్చి చెప్పింది.
కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు..
డీపీఆర్‌ను అప్రైజల్ లిస్టు నుంచి తప్పించడంతో పలుమార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు కేంద్రం వద్ద గట్టిగానే వాదనలు వినిపించారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 2024 జనవరి 11న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.
దానికి కేంద్ర జలశక్తి శాఖ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రాజెక్టుకు హోదా ఇవ్వలేమని పేర్కొంటూనే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు అసలు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే చేయలేమని స్పష్టం చేస్తూ అదే ఏడాది జనవరి 29న సీఎం రేవంత్‌కు రిప్లై ఇచ్చింది.
ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడానికి లేదని తేల్చి చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరుపడడంతో రెండు రాష్ట్రాలకు సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలను కేటాయించాల్సి ఉంటుందని, కృష్ణాలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులున్నాయని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు కేటాయించేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ నడుస్తున్నదని ఆ లేఖలో సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టును పెండింగ్‌లో పెడుతూ వస్తున్నది. పలుమార్లు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కారు కోరినా పెడచెవిన పెట్టింది. ఆ క్రమంలోనే 2024 డిసెంబర్లో ప్రాజెక్ట్ డీపీఆర్‌ను అప్రైజల్ లిస్టు నుంచి తప్పించింది.
