ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది మృతి

ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది మృతి
  •     లాన్సెట్ నివేదిక వెల్లడి
  •     2022 ఏడాదికి సంబంధించి లాన్సెట్ నివేదిక వెల్లడి
  •     బొగ్గు, ఆయిల్  మండించడంతో విపరీతమైన కాలుష్యం
  •     సూక్ష్మకణాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ: మన దేశంలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఒక్క 2022 సంవత్సరంలోనే గాలి కాలుష్యం కారణంగా 17 లక్షల మంది భారతీయులు చనిపోయారని లాన్సెట్  నివేదిక వెల్లడించింది. ‘లాన్సెట్  కౌంట్ డౌన్  ఆన్  హెల్త్  అండ్  క్లైమేట్  చేంజ్’ పేరుతో గత వారం లాన్సెట్  ఒక రిపోర్టును విడుదల చేసింది. 2010 దేశం నుంచి భారత్ లో వాయు కాలుష్యం 38 శాతం పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ‘‘బొగ్గు, ఆయిల్, గ్యాస్  వంటి శిలాజాలను మండించడం వల్ల గాలిలో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో ఆ కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల ద్వారా లోపలికి ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఆ కణాలు చాలా చిన్నగా ఉండడం వల్ల సులభంగా మన లంగ్స్ లోకి వెళ్లి సులభంగా రక్తంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇక 2022లో చనిపోయిన వారిలో  7.5 లక్షల మంది ఫాసిల్  ఫ్యుయెల్  (శిలాజాలను మండించడం ద్వారా వెలువడిన గాలిని పీల్చడం) వల్లే ప్రాణాలు కోల్పోయారు. వారిలో బొగ్గు కారణంగా 4 లక్షల మంది మృతి చెందారు. ఇక 2022లో ప్రపంచవ్యాప్తంగా శిలాజాల కారణంగా జరిగిన గాలి కాలుష్యం వల్ల 25 లక్షల మంది చనిపోయారు” అని నివేదిక వివరించింది.

మరింత డేంజర్​లో ఢిల్లీ.. 569గా ఏక్యూఐ

ఢిల్లీ, నేషనల్  క్యాపిటల్  రీజియన్ (ఎన్​సీఆర్)లో సోమవారం ఎయిర్  క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘సివియర్’  కేటగిరిలోకి వెళ్లింది. ఘజియాబాద్‌లో 569, గ్రేటర్  నోయిడాలో 568, నోయిడాలో 551, ఫరీదాబాద్​లో 546, ఢిల్లీలో 480, గురుగ్రాంలో 454గా ఏక్యూఐ రికార్డయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ఎన్​సీఆర్ కు ఎయిర్  క్వాలిటీ మేనేజ్ మెంట్  కమిషన్  డైరెక్టివ్ లను జారీ చేసింది. ఔట్ డోర్  ఫిజికల్  యాక్టివిటీస్‌ను వెంటనే ఆపివేయాలని సూచించింది.