యూత్ ఎంజాయ్ చేయాలి అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ గోవా. అక్కడ ఉండే రిసార్ట్స్, బీచ్, పబ్స్, తక్కువ రేటుకే మద్యం ఇలా అనేక అంశాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా తక్కువ బడ్జెట్లోనే ట్రిప్ కంప్లీట్ చేయెుచ్చని చాలా మంది వెళుతుంటారు. దీనికి తోడు అక్కడ విదేశీ పర్యాటకుల సందడి కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే విదేశీయులను ఇబ్బందిపెడుతూ, వారితో ఫోటోలు దిగేందుకు బలవంతంగా ప్రయత్నాలు చేసే ఆకతాయిలను ఉపేక్షించేది లేదని గోవా పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఇకపై గోవా టూర్స్ కి వెళ్లే యువత జాగ్రత్తగా ఉండకపోతే జైల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అసలు పోలీసులు తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటి దాని వల్ల ఏం జాగ్రత్తలు పాటించాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గోవా పర్యాటక రంగంలో ఫారెన్ టూరిస్టుల సేఫ్టీ, గౌరవం విషయంలో అక్కడి పోలీసులు అత్యంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అనుమతి లేకుండా విదేశీ పర్యాటకులను ఫోటోలు తీయడం లేదా వారితో సెల్ఫీల కోసం వేధించడం లాంటి చర్యలకు పాల్పడే వారిని వెంటనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తాజాగా హెచ్చరించారు. ముఖ్యంగా గోవాలోని బీచ్‌లలో ఇండియన్ టూరిస్టుల ప్రవర్తన వల్ల విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే ఫిర్యాదులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ పర్యాటకుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఇకపై జైలు శిక్ష తప్పదని గోవా పోలీసులు తెల్చి చెప్పారు.
ఇటీవలి కాలంలో నార్త్ గోవాలోని బీచ్‌లలో అనేక వేధింపుల ఘటనలు బయటకు వచ్చాయి. తాజాగా కలాంగుట్ బీచ్‌లో ఓ రష్యన్ మహిళను వేధించిన కేసులో ఒడిశాకు చెందిన ఇద్దరు పర్యాటకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ అనుమతి లేకుండా ఫోటోలు తీయడమే కాకుండా.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై గోవా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి ముందు నవంబర్‌లో ఆరంబోల్ బీచ్‌లో ఇద్దరు విదేశీ మహిళలను బలవంతంగా ఫోటోల కోసం చుట్టుముట్టి వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు గోవా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తున్నాయని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గోవా పోలీసుల ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీగానే సపోర్ట్ లభిస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో క్రమశిక్షణ లేని ప్రవర్తన వల్ల విదేశీ పర్యాటకులు భారత్ రావడానికి భయపడుతున్నారని.. ఇలాంటి కఠిన చట్టాలు ఎప్పుడో రావాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని.. ప్రజల ప్రవర్తనలో కూడా మార్పు రావాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. విదేశీ పర్యాటకులను కేవలం ఒక వింత వస్తువులా చూడటం, వారి అనుమతి లేకుండా వ్యక్తిగత ప్రదేశాల్లోకి చొరబడటం వంటివి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
గోవా ప్రభుత్వం ఈ చర్యల ద్వారా అంతర్జాతీయ పర్యాటకులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. గోవా సందర్శించే వారు ఎవరైనా సరే.. ఇక్కడి రూల్స్ గౌరవించాలని, ముఖ్యంగా మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని పోలీసులు కోరుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, అనుమానాస్పదంగా ప్రవర్తించే వారిపై నిఘా ఉంచుతున్నారు. ఈ కఠిన నిబంధనల వల్ల గోవాలో పర్యాటక వాతావరణం మళ్లీ ఆహ్లాదకరంగా మారుతుందని, పర్యాటకుల భద్రతకు భరోసా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
