దేశానికే ఆదర్శం మన ATCలు.. జర్మన్ భాషలో యువతకు శిక్షణ: మంత్రి వివేక్

దేశానికే ఆదర్శం మన ATCలు.. జర్మన్ భాషలో యువతకు శిక్షణ: మంత్రి వివేక్

మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డి గూడలో రూ.12 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు.

 సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు సరికొత్త సాంకేతికతను అందిస్తూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సెంటర్లలో సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఏటీసీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని.. ఇక్కడి విద్యా విధానాన్ని, సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించి ప్రశంసించిందని మంత్రి గర్వంగా గుర్తుచేశారు. ఈ సెంటర్ల ద్వారా యువతకు సరికొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులకు మరింత భరోసా కల్పిస్తూ.. ఏటీసీల్లో చదివే ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 2,000 స్టైఫండ్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. కేవలం సాంకేతిక విద్యే కాకుండా.. టామ్ కామ్ (TOMCOM) ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : మూడు తరాల సమస్య 33 గేట్ల ప్రారంభంతో తీరబోతోంది

గ్లోబల్ మార్కెట్‌లో యువత రాణించేందుకు వీలుగా టామ్ కామ్ ఆధ్వర్యంలో జర్మనీ భాషలో సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని.. తద్వారా విదేశాల్లోనూ ఉద్యోగాలు సాధించేలా యువతను తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.