పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్, ఆర్‌డీ, సుకన్య సమృద్ధి ఖాతాలు ఉన్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నాలజీని వాడుకుంటూ కస్టమర్ల పనిని మరింత సులువు చేయడానికి సరికొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పోస్టాఫీసుల్లో లావాదేవీల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన పనిలేదు, పేపర్లు ఫిల్ చేయాల్సిన అవసరమూ లేదు. కేవలం మీ బయోమెట్రిక్ ఆధారంగా క్షణాల్లో పనులు పూర్తయిపోయేలా 'ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ' ట్రాన్సాక్షన్స్ సదుపాయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ అధికారికంగా ప్రారంభించింది.
'డ్రీమ్' మొబైల్ యాప్ ద్వారా ఈ సరికొత్త సేవలను లాంచ్ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచ్ పోస్టాఫీసు సేవలను ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా, పారదర్శకంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. జూన్ 22న విడుదలైన తాజా ఉత్తర్వుల ప్రకారం.. కస్టమర్లు తమ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి పరిమిత డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ ప్రకారం కస్టమర్లు తమ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, ఆర్‌డీ, సుకన్య సమృద్ధి ఖాతాల్లో పే-ఇన్ స్లిప్ లేకుండానే రూ.50వేల వరకు జమ చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి విత్‌డ్రాయల్ ఫారమ్ లేకుండానే కేవలం వేలిముద్రతో రూ.20వేల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ డిజిటల్ విప్లవంలో భాగంగా కస్టమర్ల పాత సీఐఎఫ్ నంబర్లను ఆధార్ ఈ-కేవైసీ సీఐఎఫ్‌గా మారుస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో డిజిటల్ అథెంటికేషన్ మరింత సులభతరం అవుతుంది. అంతేకాదు ఆధార్ లింక్ అయిన అకౌంట్లు ఉన్నవారు తమ సొంత బ్రాంచ్‌కే కాకుండా.. ఏ పోస్టాఫీస్ బ్రాంచ్‌కైనా వెళ్లి సేవలను సులభంగా పొందవచ్చు. ఈ బయోమెట్రిక్ సదుపాయం ప్రస్తుతానికి సింగిల్ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. జాయింట్ అకౌంట్లు, మైనర్ల పేరిట ఉన్న అకౌంట్లకు ఈ కొత్త రూల్ వర్తించదని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు పైన చెప్పిన లిమిట్ మించి లావాదేవీలు చేయాలనుకుంటే.. పాత పద్ధతిలోనే పేపర్ ఫారమ్‌లు నింపి, అకౌంట్స్ ఆఫీస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందే.
ఖాతాదారులు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 'డ్రీమ్' అప్లికేషన్ ద్వారా ఆధార్ ఈ-కేవైసీ లావాదేవీలు జరపాలనుకునే ప్రతి ఒక్కరికీ మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని ఖాతాలకు ఈ యాప్ ద్వారా ఎలాంటి డిజిటల్ లావాదేవీలు అందించబడవు. కాబట్టి పోస్టాఫీస్ ఖాతాదారులు వెంటనే తమ అకౌంట్లను ఆధార్, మొబైల్ నంబర్లతో లింక్ చేసుకుని పేపర్‌లెస్ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవడం మంచిది.
