ముహూర్తాలు లేకున్నా.. మూఢాల్లోనూ లగ్గాలు

ముహూర్తాలు లేకున్నా.. మూఢాల్లోనూ లగ్గాలు
  • శుభకార్యానికి అన్నీ మంచి రోజులే అంటున్న జనం 
  • మన దగ్గరా ట్రెండ్ అవుతున్న ‘‘హర్ దిన్ శుభ్ హై” క్యాంపెయిన్

హైదరాబాద్‌‌, వెలుగు: బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్‌‌ను ఆదివారం ముంబైలోని అలీబాగ్‌‌లో పెళ్లి చేసుకోనున్నారు. మూడేండ్లుగా ప్రేమలో ఉన్న సాఫ్ట్‌‌వేర్‌‌ ఎంప్లాయ్‌‌ అంకిత్‌‌ ఫిబ్రవరి 14న పెండ్లి చేసుకోబోతున్నాడు. యూట్యూబ్ స్టార్, మూవీస్‌‌లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న  వైవా హర్ష, అక్షరల ఎంగేజ్ మెంట్ ఈ నెల 11న అయ్యింది. 

..ఇట్ల సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెండ్లిలు చేసుకుంటున్నారు. పూలు పండ్లు (ఎంగేజ్ మెంట్), ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. పెండ్లంటే రెండు మనసులు, రెండు కుటుంబాలు కలవడమని..  అంతకన్నా మంచి ముహూర్తం ఏముంటుందని కొందరు అంటున్నారు. ‘‘ప్రతిరోజూ మంచి రోజే’’.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. పోయినేడు మార్చిలో లాక్ డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి.మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

వెడ్డింగ్ ప్లానర్ల కాన్సెప్ట్ తో…

‘‘హర్‌‌‌‌దిన్‌‌‌‌శుభ్‌‌‌‌హై (ప్రతిరోజూ మంచిరోజే)’’.. ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. దీనికి ముఖ్యమైన కారణమెవరంటే వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్ లో రూ.లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్‌‌ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్‌‌‌‌ ప్లానర్లు, ఈవెంట్‌‌ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్‌‌, డెకరేషన్‌‌, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇట్ల ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెండ్లిల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా పోయినేడు లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ లాక్ లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్ కు తెరదీశారు. ‘‘హర్‌‌‌‌దిన్‌‌‌‌శుభ్‌‌‌‌హై’’ కాన్సెప్ట్‌‌ తో ముందుకొచ్చారు. లగ్గాలు చేసుకునేటోళ్లు, వాళ్ల తల్లిదండ్రులు కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ లగ్గాలు జరుగుతున్నాయి.

ముహూర్తంతో పనేముంది..

‘‘మూడేండ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇద్దరం ఇంట్లో విషయం చెప్పేశాం. పెద్దలు ఒప్పుకున్నారు. తొందరగా పెండ్లి చేసుకోండని గోల పెడుతున్నారు. అందుకే చేసుకుందామని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరికీ ఇష్టమై, మేం సంతోషంగా లైఫ్‌‌ను లీడ్‌‌ చేయాలని అనుకున్నప్పుడు ముహూర్తంతో పనేముంది. అందుకే ఎలాంటివి పట్టించుకోకుండా వాలంటైన్ డే (ఫిబ్రవరి 14) రోజున పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అని సికింద్రాబాద్‌‌కు చెందిన సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఎంప్లాయ్ అంకిత్‌‌ చెప్పారు. శ్రీకాకుళానికి చెందిన మరో సాఫ్ట్‌‌ వేర్‌‌‌‌ఎంప్లాయ్ కూడా  ఫిబ్రవరి 13న పెళ్లి చేసుకోనున్నాడు. ఎస్‌‌ఆర్‌‌నగర్‌‌కు చెందిన మురళీధర్‌‌ తన కూతురుకు ఐదేండ్లుగా సంబంధాలు చూస్తుంటే.. మంచి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌అబ్బాయి దొరికాడు. అమ్మాయికి కూడా నచ్చాడు. దాంతో ఆలస్యం చేయొద్దని, ఫిబ్రవరిలో ఎంగేజ్‌‌మెంట్‌‌ పెట్టుకున్నారు. పెళ్లి ఎప్పుడంటే అప్పుడు చేద్దామని నిర్ణయించుకున్నారు. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్ లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని.. ఈ ఎగ్జాంపుల్స్ ను బట్టి తెలుస్తోంది.

జనం ఆలోచనల్లో మార్పు…

‘‘మా మ్యారేజ్ బ్యూరో తరఫున వచ్చే నెలలో నాలుగు పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి. కొంతమంది ఎంగేజ్మెంట్లు కూడా అయ్యాయి. ఫిబ్రవరి 14, 19 తేదీల్లో రెండు, మూడు పెళ్లిళ్లు ఉన్నాయి. యాదగిరిగుట్టలో ఒక పెళ్లి చేస్తున్నాం’’ అని తోడునీడ మ్యారేజ్‌‌ కన్సల్టెన్సీ ప్రతినిధి లహరి తెలిపారు. అమెరికా సంబంధాలు కుదిరినప్పుడు చాలా మినహాయింపులు ఉంటున్నాయని.. అబ్బాయి, అమ్మాయి ట్రావెలింగ్‌‌‌‌ డేట్స్‌‌ ను బట్టి అన్నీ మారిపోతుంటాయని వివరించారు. ‘‘మండపాలకు వెళ్లి మేం పెండ్లి చేయం. కానీ చాలామంది టెంపుల్స్ లో చేసుకుంటారు’’ అని పూజారి నాగరాజు శర్మ తెలిపారు. ‘‘మూఢాల్లో లవ్‌‌‌‌ మ్యారేజీలు బాగానే జరుగుతాయి. వాళ్లు ఎలాగూ ముహూర్తాలు చూసుకోరు. కొందరు టెంపుల్స్‌‌లో చేసుకుంటారు. కొందరు దండలు మార్చుకుంటారు. ఎవరి ఇష్టాలను మనం కాదనగలం’’ అని జగదీశ్ అనే పూజారి అన్నారు.

వద్దంటున్నా వింటలేరు..

దాదాపు 104 రోజులు ముహూర్తాలు లేవు. అయినా చాలామంది ముహూర్తం పెట్టమని అడుగుతున్నారు. మే 13 నుంచి ముహూర్తాలు మొదలవుతాయని చెబుతున్నా, వినడం లేదు. తమకు నచ్చిన రోజులు చెప్పి, ఏదో ఒక ముహూర్తం చూడమని అడుగుతున్నారు. మేమైతే మూడాల్లో వద్దనే చెబుతున్నాం.

–  వినోద్‌ శర్మ, పూజారి

ఫ్లెక్సిబులిటీ చూసుకుంటున్నరు

కపుల్స్‌‌థింకింగ్‌లో మార్పు వచ్చింది. ఒక ప్పుడు ముహూర్తాలు పక్కాగా ఉంటేనే పెళ్లి చేసుకునేవాళ్లు. ఇపుడు ఫ్లెక్సిబులిటీ చూసు కుంటున్నరు. 30–40% మంది తమకు అనుకూలంగా ఉన్న టైమ్‌లోనే లగ్గం చేసుకుంటున్నారు.

– విజయ్‌, దక్ష్‌‌ ఈవెంట్‌‌ మేనేజ్మెంట్‌ సర్వీసెస్‌‌

వచ్చే నెలలో రెండున్నాయ్..

ఈ నెల 8న మూడాలు ప్రారంభమైనా, పెట్టుడు ముహూర్తాల్లో పెండ్లిలు జరుగుతున్నాయి. మా దగ్గర జనవరి 10న ఒక పెండ్లి జరిగింది. ఈ నెలలో ఇంకో రెండు, వచ్చే నెలలో  నాలుగు లగ్గాలు ఉన్నాయి.

– మధుసూధన్‌ రెడ్డి,మేకల భారతి గార్డెన్స్‌, ఉప్పల్‌