
- రాహుల్ కు వయనాడ్ లో ఓటమి ఖాయం
రాహుల్ కొత్త సీటు వెతుక్కుంటారని తాను ముందే చెప్పానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీని ఉద్దేశించి.. ఆ పార్టీ పెద్ద ఒకరు ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చేయరని, పారిపోతారని గతంలో తాను పార్లమెంట్‌లో వెల్లడించానని చెప్పారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారన్నారు. యువరాజు వయనాడ్‌లో ఓడిపోనున్నారని, అక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తారని చెప్పానని అదీ జరిగిందని అన్నారు.
అమేథీ అంటే భయమేసి రాయ్‌బరేలీ వైపు పరుగులు తీస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఎలాంటి ఒపీనియన్ పోల్స్ అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్ల కోసం సమాజాన్ని ఎలా విభజించాలో మాత్రం తెలుసని విమర్శించారు. రాహుల్ పోటీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా స్పందించారు. గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ కూడా అమేథీలో పోటీ చేయడం లేదంటే ఎన్నికలకు ముందే వారక్కడ ఓటమిని ఒప్పుకున్నారనేందుకు నిదర్శనమని అన్నారు.