మావోయిస్ట్ గణపతి లొంగిపోవట్లేదు

మావోయిస్ట్ గణపతి లొంగిపోవట్లేదు

గణపతి లొంగుబాటు ప్రచారాన్ని ఖండించిన మావోయిస్ట్‌‌‌‌ పార్టీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు

ఇంటలిజెన్స్ పథకం ప్రకారమే హైటెన్షన్‌‌‌‌ క్రియేషన్‌‌‌‌

అనారోగ్యంతోనే గణపతి బాధ్యతల నుంచి తప్పుకున్నరు

ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు

హైదరాబాద్‌‌, వెలుగు: మావోయిస్ట్‌‌ అగ్రనేత గణపతి లొంగిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ (మావోయిస్ట్‌‌) సెంట్రల్‌‌ కమిటీ ఖండించింది. ప్రధాని మోడీ, అమిత్‌‌షా, సీఎం కేసీఆర్‌‌, సెంట్రల్‌‌ ఇంటలిజెన్స్‌‌, ఎస్‌‌ఐబీ‌‌లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ఇంటలిజెన్స్ పథకం ప్రకారమే హైటెన్షన్‌‌ క్రియేట్‌‌ చేస్తున్నారని ఆరోపించింది. గణపతి లొంగుబాటుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌‌ పేరుతో గురువారం ప్రకటన విడుదల చేసింది. గణపతి ఆరోగ్య పరిస్థితుల గురించి లెటర్‌‌‌‌లో వెల్లడించింది.

గణపతికి స్వల్ప అనారోగ్యం

కామ్రేడ్‌‌ గణపతి స్వల్ప అనారోగ్యం కారణంగా కార్యదర్శి బాధ్యత నుంచి తప్పుకున్నారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. బాధ్యతలను ఇతరులకు అప్పగించారని తెలిపింది. పోరాట సంస్థల్లో ఇలాంటి మార్పులు సహజమేనని.. సిద్ధాంత పరంగా, రాజకీయంగా నాయకత్వం దృఢంగా ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాలకులను ముచ్చెమటలు పట్టిస్తున్నామని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వపు ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది.

ఫేక్‌‌ న్యూస్‌‌ ప్రచారం చేస్తున్నారు

ప్రభుత్వం, ఇంటలిజెన్స్‌‌ సంస్థలు క్రియేట్‌‌ చేసిన ఫేక్‌‌ న్యూస్‌‌ను మీడియా ప్రచారం చేస్తోందని మావోయిస్ట్‌‌ సెంట్రల్‌‌ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టాలని, దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చింది. మోడీ, ఇంటలిజెన్స్‌‌ అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పింది. ఎంతో అనుభవం ఉన్న నాయకత్వంలో పార్టీ కేడర్‌‌‌‌ పనిచేస్తోందని స్పష్టం చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని.. అంతిమ విజయం సాధిస్తామని చెప్పింది.

ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరుగుతోంది

వరవర రావు, సాయిబాబా, ఆనంద్‌‌ తేల్‌‌ తుమ్డే, సుధా భరద్వాజ్‌‌, అరుణ్‌‌ పెరేరా, వెర్నెన్‌‌ గొంజాల్వేస్‌‌, రోనా విల్సన్‌‌, సురేందర్‌‌‌‌ గాడ్లింగ్‌‌, సోమా సేన్‌‌, గౌతమ్‌‌ నవలఖా, సుధీర్‌‌‌‌ దావ్లే, మహేశ్‌‌ రౌత్‌‌లను జైళ్లలో నిర్బంధించిందని మావోయిస్ట్‌‌ సెంట్రల్‌‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్బంధాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరిగిపోతున్నాయని చెప్పింది. కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో మోడీ సర్కార్‌‌‌‌ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని ఆరోపించింది. ప్రపంచ టెర్రరిస్ట్‌‌ ట్రంప్‌‌ సేవలో ప్రధాని మునిగిపోయారంటూ మండిపడింది. 2022 నాటికి మావోయిస్ట్‌‌ పార్టీని నిర్మూలించాలనుకునే ప్రభుత్వాల లక్ష్యం నెరవేరదని ధీమా వ్యక్తం చేసింది.